ఆ విషయంలో నిర్మాతలు షాక్‌ ఇచ్చారు!: హీరో | Sakshi
Sakshi News home page

Atithi Devo Bhava: లైన్‌లో నాలుగు సినిమాలు, ఓటీటీ ఆఫర్‌ వచ్చినా ఓకే..

Published Thu, Jan 6 2022 7:57 AM

Aadi Saikumar About Atithi Devo Bhava Movie - Sakshi

‘‘నేను చేసిన సినిమాల్లో కొన్ని వైఫల్యమవడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని ఎగ్జిక్యూషన్‌ ప్రాబమ్స్‌ అయితే మరికొన్ని చిత్రాలకు రిలీజ్‌ డేట్స్‌ కలిసి రాలేదు. ‘చుట్టాలబ్బాయి’, ‘రఫ్‌’ చిత్రాలకు రిలీజ్‌ డేట్స్‌ కలిసి రావడంవల్ల రెవెన్యూ పరంగా ఆ సినిమాలు స్ట్రాంగ్‌ అయ్యాయి. ఇప్పుడు ‘అతిథి దేవో భవ’ చిత్రానికి మంచి రిలీజ్‌ డేట్‌ దొరికిందనే భావిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్‌ అన్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వంలో మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానున్న సందర్భంగా ఆది సాయికుమార్‌ చెప్పిన విశేషాలు.

‘అతిథి దేవో భవ’లో నా క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది. సినిమాలో హీరోకి ఓ ఫోబియా ఉంటుంది. ఒంటరిగా ఉండటం అంటే భయం. దీంతో తనకు తోడుగా ఎవరు వచ్చినా ‘అతిథి దేవో భవ’ అని ఫీలవుతుంటాడు. ఒక్క రోజులో జరిగే కథ ఇది. మంచి మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. రోహిణిగారు తల్లి పాత్ర చేశారు. స్క్రీన్‌ ప్లే పరంగా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ ప్రస్తుత పరిస్థితులకు కనెక్ట్‌ అవుతుంటాయి. వ్యక్తిగత విషయానికి వస్తే.. కొందరు ఒంటరిగా ఉండటానికి భయపడుతుంటారని చెబుతుంటారు. కానీ నేను ఒంటరిగా ఉండగలను. ఈ ఆధునిక రోజుల్లో ఒంటరిగా ఉండేందుకు టైమ్‌ దొరకడం కూడా అరుదే.

నాగేశ్వర్‌గారు చాలా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఈ సినిమాను బాగానే తీశారు. ప్రొడ్యూసర్స్‌ కూడా కాంప్రమైజ్‌ కాలేదు. నిజానికి డిసెంబరులోనే విడుదల చేద్దాం అనుకున్నాం.. తేదీ కుదర్లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా పడటంతో ఈ నెల 7న వస్తున్నాం. ‘అతిథి దేవో భవ’ రిలీజ్‌ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలకు ధన్యవాదాలు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని, రిలీజ్‌ విషయంలో నాకు నిర్మాతలు షాక్‌ ఇచ్చారు (నవ్వుతూ).

‘బ్లాక్‌’, ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ చిత్రాల షూటింగ్‌  పూర్తయింది. గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండే ‘అమర్‌: ఇన్‌ ది సిటీ’, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సీఎస్‌ఐ సనాతన్‌’ సినిమాల షూటింగ్‌ జరుగుతోంది. ‘జంగిల్‌’ సినిమాతో తమిళంలో పరిచయం అవుతున్నాను. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా తీస్తున్నాం. సంక్రాంతికి ‘ఫన్నీ కృష్ణ’ అనే కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తున్నాం. ఈ ఏడాది నా సినిమాలు కనీసం నాలుగు రిలీజ్‌ అవుతాయనే నమ్మకం ఉంది. ఇక లాక్‌డౌన్‌కు ముందు ఓటీటీ ఆఫర్‌ వస్తే, వద్దనుకున్నాను. ఇప్పుడు ఓటీటీ హవా కనిపిస్తోంది. మంచి స్క్రిప్ట్‌ వస్తే ఒప్పుకుంటాను.

Advertisement
Advertisement