Pongal Fight: పదిసార్లు పోటీపడ్డారు.. 11వ సారి విజయమెవరిదో?

10 Epic Pongal Box Office Clashes Between Chiranjeevi, Nandamuri Balakrishna - Sakshi

చిరంజీవి-బాలయ్యల మధ్య సినిమాల పోరు ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి సంక్రాంతి పండగ సందర్భంగా ఇద్దరి సినిమాలూ పోటీ పడటం కూడా ఇపుడే మొదలు కాలేదు. మూడున్నర దశాబ్ధాలుగా ఇద్దరి సినిమాలు కొదమ సింహాల్లా తలపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఇద్దరికీ బ్లాక్ బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం సాగుతూనే ఉంది. యుద్ధం సినిమాల మధ్యనే తప్ప నటుల మధ్య కాదు. అయితే 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండగ సమయంలో హోరా హోరీ తలపడే రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రెండింటినీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పెద్ద ప్రాధాన్యతే ఉంది. రైతుల పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి రైతుల దగ్గర నాలుగు డబ్బులు ఆడతాయి. సకల వ్యాపారాలూ కళకళలాడుతూ ఉంటాయి. అందులో సినిమా వ్యాపారానికి ఇది అసలు సిసలు సీజన్ అనే చెప్పాలి. అందుకే అగ్రనటులు తమ ప్రతిష్ఠాత్మక సినిమాలను సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.

నందమూరి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా ఊర మాస్ హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలైతే మాస్ జనాల్లో పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్లు కళకళలాడిపోతాయి. అందులోనూ సంక్రాంతి సీజన్‌లో ఈ ఇద్దరి సినిమాలూ విడుదలైతే మాత్రం అటు అభిమానులకూ ఇటు ఫ్యాన్స్‌కూ సంక్రాంతిని మించిన పెద్ద పండగే అవుతుంది.

1987 సంక్రాంతిలో బాలయ్య- చిరంజీవిల సినిమాలు మొదటిసారి తలపడ్డాయి. జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన 'దొంగ మొగుడు' విడుదలైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయిదు రోజుల తర్వాత జనవరి 14న బాలయ్య కోదండరామిరెడ్డిల కాంబినేషన్‌లో రూపొందిన 'భార్గవ రాముడు' సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నా దొంగమొగుడు సినిమాకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని సినీ రంగ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

► ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న చిరంజీవి కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన 'మంచి దొంగ' విడుదలైంది. ఆ మర్నాడే జనవరి 15న బాలయ్య  ముత్యాల సుబ్బయ్యల సినిమా 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' విడుదల అయ్యింది. వీటిలో మంచి దొంగ ఏవరేజ్ హిట్ కాగా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ హిట్ టాక్ తెచ్చుకుంది.

► 1989 సంక్రాంతి బరిలో జనవరి 14న  చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరుసటి రోజున జనవరి 15న బాలయ్య నటించిన భలేదొంగ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిసింది.

► ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. ముందుగా 1997 జనవరి 4న 'హిట్లర్' సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా 'పెద్దన్నయ్య' విడులైంది.ఈ సినిమా కూడా హిట్ టాక్‌తో దూసుకుపోయింది.

► మరో రెండేళ్ల తర్వాత 1999లో జనవరి 13న బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' రిలీజ్ అయ్య ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.

► రెండు వేల సంవత్సరంలో జనవరి 7న చిరంజీవి సినిమా 'అన్నయ్య' విడుదలైంది. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. వారం తర్వాత జనవరి 14న బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు' రిలీజ్ అయ్యింది. ఇది ఫ్లాప్ అయ్యింది.

► 2001 జనవరి 11న బాలయ్య సినిమా 'నరసింహనాయుడు' విడుదలై  భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన 'మృగరాజు' విడుదలైంది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే డిజాస్టర్ గా నిలిచింది.

► మళ్లీ మూడేళ్ల తర్వాత బాలయ్య, చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004 జనవరి 14న బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహ' విడుదలై సూపర్ హిట్  అయ్యింది. ఆ మర్నాడు జనవరి 15న చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలై  అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

► 2004 తర్వాత మళ్లీ ఇద్దరూ 2017 సంక్రాంతిలో తలపడ్డారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఇంచుమించు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు.

► 2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌ను సంక్రాంతి సీజన్‌లోనే ప్రారంభించారు. 2017 జనవరి 11న చిరంజీవి వినాయక్‌ల కాంబినేషన్‌లో చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన 'ఖైదీ నంబర్ 150' సూపర్ హిట్ అయ్యింది. జనవరి 12న బాలయ్య నటించిన చారిత్రక సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విడుదలై పెద్ద హిట్ కొట్టింది.

ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్‌లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి  వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మాంచి మాస్ క్యారెక్టర్ తో వీర సింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారన్నది తేలాల్సి ఉంది.

చదవండి: బాక్సులు బద్ధలైపోతాయని రవితేజ వార్నింగ్‌.. వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ చూశారా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top