ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు
● ప్రభుత్వానికి రూ.351 కోట్ల బకాయిలు
● ఇప్పటి వరకు రూ.126 కోట్ల చెల్లింపు
● ధాన్యం అమ్ముకున్న కొందరు మిల్లర్లు
● 14 మిల్లులపై కేసులు నమోదు
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించడంలో కొందరు మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. పలు సీజన్లకు చెందిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటే, మరికొందరు సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 100 రైస్ మిల్లులు ఉండగా, 51 రా రైస్.. 49 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. కాగా, పలు సీజన్లకు సంబంధించిన ధాన్యం మిల్లులకు కేటాయించగా, కొందరు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. మరికొందరు సకాలంలో ఇవ్వకపోవటంతో వారి నుంచి ధాన్యానికి బదులుగా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ. 351 కోట్లు బకాయి ఉండగా, ఇప్పటివరకు రూ.126 కోట్లు వసూలయ్యాయి. ఈ లెక్కన ఇంకా రూ. 225 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
14 మిల్లులపై కేసులు
ధాన్యం అమ్ముకున్న మిల్లర్లతో పాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వని వారికి అధికారులు నోటీస్‌లు ఇచ్చారు. ఇప్పటివరకు 14 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు తీవ్రమయ్యాయి. అనేక మిల్లుల్లో ధాన్యం లోటు వెలుగులోకి వస్తుంది. కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆర్‌ఆర్‌యాక్టు ఉపయోగించి డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
ధాన్యం తీసుకున్న మిల్లర్లు సకాలంలో బియ్యం తిరిగి ఇవ్వకపోవటంతో ఏళ్ల తరబడి మిల్లులు, ఇతర గోదాంల్లో నిల్వ ఉండటంతో ప్రభుత్వం ఆ ధాన్యా న్ని కొంత కొంతగా టెండర్ వేస్తోంది. 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేసింది. దీంతో ఓ కాంట్రాక్టర్ క్వింటాల్‌కు రూ. 2,389 చొప్పున చెల్లించి తీసుకున్నాడు. ఆ ధాన్యానికి మిల్లర్లు క్వింటాల్‌కు రూ. 2,500 చొప్పున చెల్లించి కాంట్రాక్టర్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ. 111 కాంట్రాక్టర్ లాభం పొందుతున్నాడు. ఇదే టెండర్ వేయకుంటే ప్రభుత్వానికే ఆదాయం వచ్చేదని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు.
2022–23 రబీ ధాన్యానికి సంబంధించి జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఓపెన్ టెండర్ నిర్వహించింది. దీంతో ఓ టెండర్‌దారుడు క్వింటాల్‌కు రూ. 1,900 చొప్పున చెల్లించి స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆ కాంట్రాక్టరు ఆ ధాన్యం తీసుకెళ్లలేదు. దీంతో అదే ధరకు తమకు ఇవ్వాలని జిల్లాలోని 67 మంది మిల్లర్లు కోరారు. క్వింటాల్‌కు రూ. 2,280 చొప్పున ఇస్తామని అధికారులు తెలిపారు. దీనిపై సదరు మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ అందరిపై ఒత్తిడి తెస్తూ కేసులు నమోదు చేస్తున్నారంటూ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ధాన్యాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పారు. దీంతో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అధికారులు గోదాంలు, రైతు వేదికలను సిద్ధం చేస్తున్నారు.


