చక్రం తిప్పేదెవరో? | - | Sakshi
Sakshi News home page

చక్రం తిప్పేదెవరో?

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

పదేళ్ల తర్వాత ఎన్నికలు

నేడే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

సంగారెడ్డి జోన్‌/సంగారెడ్డి టౌన్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. డిపోల వారీగా పోలింగ్‌ నిర్వహణకు కార్మిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 26 నుంచి మెదక్‌ రీజియన్‌ పరిధిలో బరిలో ఉన్న కార్మిక సంఘాల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. దశాబ్ద కాలం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో గెలుపు, ఓటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు డిపోల వారీగా 5 నుంచి 8 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ స్టేషన్‌ల పర్యవేక్షకులుగా కార్మిక శాఖ అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లను నియమించారు.

ప్రతి ఓటరు రెండు ఓట్లు

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. రాష్ట్రస్థాయిలో ఒక ఓటు, రీజియన్‌ స్థాయిలో మరో ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఫలితాల ప్రకటన మాత్రం ఉండదు. పోలింగ్‌ రోజు విధి నిర్వహణలో ఉండి ఓటు వేయని వారు 14, 15 తేదీల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17న కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

8 డిపోలు.. 1,805 మంది కార్మికులు

మెదక్‌ రీజియన్‌ పరిధిలో 8 డిపోలు ఉండగా.. ఒకటి రీజనల్‌ కార్యాలయం ఉంది. అందులో 1,805 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్‌ 244, నారాయణఖేడ్‌ 200, సంగారెడ్డి 331, సిద్దిపేట 263, జహీరాబాద్‌ 272, గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ 224, దుబ్బాక 126, నర్సాపూర్‌ డిపోలో 109 మంది కార్మికులు ఉండగా, రీజనల్‌ కార్యాలయంలో 36 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ ఓటు వేసేందుకు ఆయా డిపోలలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉన్నాయి. ఇందులో టీజేఎంయూ, టీడబ్ల్యూయూ, ఎంప్లాయూస్‌ యూనియన్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ, బకాయి ఉన్న పే రివిజన్‌, అలవెన్స్‌ల చెల్లింపు, ఉద్యోగుల కొరతను అధిగమించడం, పని ఒత్తిడి తగ్గించడం తదితర డిమాండ్లు ఉన్నాయి. ప్రత్యేక సమావేశాలతో పాటు వ్యక్తిగత పరిచయాలతో ఓట్లు అభ్యర్థించారు.

సుమారు పదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న వారందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వ మద్దతుతో కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. 2018 ఆగస్టుతో పదవీకాలం ముగిసినా, అప్పటి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు.

ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌

హోరాహోరీగా సాగిన ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement