పని బారెడు..
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు కరువయ్యాయి. చేస్తున్న పనిభారం మేరకు వేతనాలు లేకపోవడం, ఉద్యోగ భద్రత కరువవడంతో మనోవేదనకు గురవుతున్నారు. దినదిన గండంలా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. – నారాయణఖేడ్
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మైనార్టీ మినహాయిస్తే 96 గురుకులాల్లో 620 పార్ట్‌టైం ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాలు 30 ఉండగా, ఇందులో 250 మంది, 40 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 200, గిరిజన సంక్షేమ గురుకులాలు 26 ఉండగా, అందులో 170 మంది పార్ట్‌టైం ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. మైనార్టీ గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయులకు నెలకు రూ.36 వేల వేతనం చెల్లిస్తున్నారు. అదే ఇతర గురుకులాల్లోని టీచర్లకు రూ. 24 వేలు ఇస్తున్నారు. అన్ని గురుకులాల్లోనూ ఉపాధ్యాయులు చేసే విధులు, బోధన ఒకేలా ఉన్నా వేతనంలో వ్యత్యాసం ఉండటంతో మనోవేదనకు గురవుతున్నారు. పెరిగే ధరలు, కుటుంబ పోషణకు వేతనం సరిపడక అవస్థలు పడుతున్నారు. తమకు కూడా సమాన పనికి సమాన వేతనం రూ.36 వేలు చెల్లించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మైనార్టీ గురుకులాలు ఉండగా, ఇందులో 210 మంది పార్ట్‌టైం ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.
అదనపు భారం
గురుకులాల్లోని పార్ట్‌టైం ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కరువైంది. వారి స్థానంలో శాశ్వత ఉపాధ్యాయుడు ఎప్పుడు వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఉద్యోగం ఊడిపోవడమే. దీంతో వారి కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారుతుంది. పార్ట్‌టైం ఉపాధ్యాయులుగా నియమితులైనా బోధనతో పాటు అదనపు విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ విభాగాలైన హౌస్‌మాస్టారు, కాస్మోటిక్స్, యూనిఫాం తదితర విభాగాల ఇన్‌చార్జిలుగా పనిచేయడం, పండగలు, ఇతర సమయాలున్నా సెలవులు లేకపోవడం, దీర్ఘకాలికంగా సేవలందిస్తున్న తమకు క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. పార్ట్‌టైం ఉపాధ్యాయులు కేటాయించిన సబ్జెక్టుల్లో బోధన, విద్యాప్రమాణాల పెంపునకు అదనపు తరగతుల నిర్వహణ, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, సందేహాల నివృత్తి, హోం వర్క్, అసైన్‌మెంట్ల పరిశీలన, అవసరమైనప్పుడు విద్యార్థుల విద్యా పురోగతిపై ఇతర ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవడం, గురుకుల వాతావరణానికి అనుగుణంగా విద్యార్థుల క్రమశిక్షణ, అభ్యసనంలో సహకరిస్తుంటారు.
వేతనాల చెల్లింపుల్లోనూ వ్యత్యాసం
కరువైన ఉద్యోగ భద్రత
కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు
పార్ట్‌టైం ఉపాధ్యాయుల్లో ఆందోళన


