పాడి రైతులకు ఊతం | - | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు ఊతం

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

● మంత్రి శ్రీధర్‌బాబు

● తూప్రాన్‌లో ‘సాబర్‌ డెయిరీ’ ప్లాంట్‌కు శంకుస్థాపన

తూప్రాన్‌: అంతర్జాతీయ స్థాయి అమూల్‌ సాంకేతికతతో ‘సాబర్‌ డెయిరీ’ ప్లాంట్‌ ఏర్పాటు కావడం శుభపరిణామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి పరిధిలోని ఉర్జా పారిశ్రామిక పార్క్‌లో నిర్మిస్తున్న ప్లాంట్‌కు నిర్వహించిన భూమి పూజలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, తద్వారా స్థానిక యువతకు శాశ్వత ఉపాధి కల్పించడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాంట్‌ ద్వారా జిల్లా పరిసర ప్రాంతాల్లోని పాడి రైతులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెటింగ్‌, మౌలిక సదుపాయాలు లభిస్తాయని తెలిపారు. గ్రామీణ ఉపాధిని పెంపొందించడంలో డెయిరీ రంగానికి తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంతటి భారీ పాడి పరిశ్రమ ఏర్పాటు కావడం ఇక్కడి పాడి రైతులకు లభించిన గొప్ప వరమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ముఖ్యంగా గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభిస్తుందన్నారు. రైతుల నుంచి సేకరించే పాలకు గిట్టుబాటు ధర దక్కేలా చూడటంతో పాటు, వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారుతుందని అభిప్రాయపడ్డారు. నిత్యం ఐదు లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్‌తో పాటు రోజుకు 200 టన్నుల పెరుగు, మజ్జిగ, లస్సీ, పనీర్‌, ఐస్‌క్రీమ్‌, నెయ్యి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారని వివరించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎస్పీ శ్రీనివాస్‌రావు, సాబర్‌ డెయిరీ చైర్మన్‌ శ్యామ్‌లాల్‌ జీ పటేల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజని, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కీర్తనరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో టోల్‌ ప్లాజా వద్ద మంత్రులకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement