అసలే అనర్హులు..
ఆపై అద్దెకు..!
డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశించిన నిరుపేదలు
● జిల్లా కేంద్రంలో 60 మందికిపైగా ఇళ్లలోకి చేరిక
● అదేబాటలో మరికొంతమంది!
మెదక్‌జోన్: నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సకాలంలో అందజేయడంలో జాప్యం జరగ్గా...కనీసం కాంగ్రెస్ సర్కారైనా తమకు ఇళ్లు అందజేస్తుందోమోనని ఆశగా ఎదురుచూసిన వారికి ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఓపిక నశించిన సదరు నిరుపేదలు ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఎవరికి వారే స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వాటిని పంపిణీ చేయకుండా అలాగే వదిలేశారు. ఇప్పట్లో పంపిణీ చేస్తారనే నమ్మకం, ఓపిక నశించిన కొందరు నేరుగా వాటిని స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 4వేలకుపైగా ఇళ్లు మంజూరు
జిల్లావ్యాప్తంగా గత బీఆర్‌ఎస్ హాయాంలో నాలుగు వేల పైచిలుకు డబుల్‌డ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,500 పైచిలుకు ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 15 వందల ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. వాటిలో చాలావరకు నిర్మాణాలు పూర్తికాక అర్ధాంతరంగా ఆగిపోగా, మిగతావి పూర్తయినా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వృథాగా వదిలేశారు.
మెదక్ జిల్లాకేంద్రంలో...!
జిల్లావ్యాప్తంగా 2,500 ఇళ్లు మంజూరు కాగా మెదక్ మున్సిపాలిటీకి 1,055 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 575 నిర్మాణాలు పూర్తి చేసి అప్పట్లోనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 480 ఇళ్లలో 247 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 233 ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లో కొన్ని ఆగిపోగా, మరికొన్ని శ్లాబులు పూర్తయ్యి గోడలు నిర్మించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిర్మాణాలు పూర్తి చేసుకున్న 247 ఇళ్లనైనా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదలు 60 మందికి పైగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆక్రమణకు సిద్ధంగా మరికొందరు!
ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయకపోగా ఇప్పటికే 60 మందికి పైగా నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటుండగా, వారి బాటలోనే మరికొందరు ఇళ్లను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా నేతలు, అధికారులు స్పందించి ఇళ్లులేని వారికి కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
జిల్లా కేంద్రానికి 1,055 ఇళ్ల మంజూరు కాగా వాటిలో 575 ఇళ్లు అప్పటి బీఆర్‌ఎస్ నేతలు పంపిణీ చేశారు. వాటిలో రాజకీయ నేతల జోక్యంతో 80 మందికిపైగా ఇళ్లను కార్లు వారికి, రాజకీయనాయకుల అనుచరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా వారు ఆ ఇళ్లను పేదలకు అద్దెకిచ్చి నెలనెలా అద్దె వసూలు చేస్తున్నారు. ఇక అర్హులైన నిరుపేదలు మాత్రం అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికై నా తమకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన నిరుపేదలు తమకిక ఆ ఇళ్లు వచ్చే అవకాశం లేదని భావించి నేరుగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు.


