● మహాలక్ష్మి పథకంతో మహిళలకు మేలు
● ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు
మెదక్ కలెక్టరేట్: మహాలక్ష్మి పథకంతో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు ఆదా చేయడం హర్షణీయమని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ బస్ స్టేషన్‌లో సాయంత్రం మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీవీరావు, జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి హేమభార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు పుష్పలత (టీచర్), యశోద(ఏఎన్‌ఎం), సిద్దేశ్వరి (టైలరింగ్ బిజినెస్), రమ్య (స్టూడెంట్)లను సన్మానించారు. అనంతరం బీవీరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా ఉంటుందన్నారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కోరారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలు ఉపన్యాసం, పాటలు అలరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, ఆర్టీసీ సీఐ, అధికారులు రాధకృష్ణ పాల్గొన్నారు.


