● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, మైనింగ్ కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతి కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ సభలకు వ్యవసాయ, విద్య, హౌసింగ్, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతోపాటు తహసీల్దార్, ఎంపీడీఓలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరు కావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామ సభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. సమీక్షలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


