జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమలు

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమలు నాలుగోసారి తైబజార్‌ వేలం వాయిదా ప్రశిక్షణను పూర్తి చేయాలి హజ్‌ యాత్రికుల టీకా శిబిరం విజయవంతం

ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏప్రిల్‌ నెలంతా పోలీసు యాక్ట్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుస్తుగా పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

పటిష్ట బందోబస్తు

హనుమాన్‌ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంలో తైబజార్‌ వేలం పాట మరోసారి వాయిదా పడింది. మంగళవారం నార్సింగి గ్రామపంచాయతీ వద్ద ఈ వేలం పాట నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, పాటలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తైబజార్‌ వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు ఈఓ నాగభూషణం తెలిపారు. కాగా నార్సింగి తైబజార్‌ వేలం పాట వాయిదా పడటంతో ఇది నాలుగోసారి కావడం విశేషం. నార్సింగిలో అంగడి (వారంతపు సంత) డిమాండ్‌ తగ్గినప్పటికి అధికారులు ప్రకటించిన కనీస ధరతో తమకు నష్టం జరుగుతుందని వేలం పాటకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత

నర్సాపూర్‌: జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం జిల్లాలో పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రశిక్షణ నిర్వహించని మండలాల్లో త్వరలో నిర్వహించాలని మండల శాఖల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి సురేశ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా హజ్‌ సొసైటీ సహకారంతో హజ్‌ యాత్రకు జిల్లా నుంచి ఎంపికై న 33 మందికి వైద్యాధికారులు టీకా వేశారు. మంగళవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీతాదేవి, జిల్లా వ్యాక్సిన్‌ అధికారి మాధురి పర్యవేక్షణలో టీకా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు జిల్లా హజ్‌ కో ఆర్డినేటర్‌ మహమ్మద్‌ ఎజాజుద్దీన్‌, మెదక్‌ జిల్లా హజ్‌ సొసైటీ సభ్యులు, ఎండీ రియాజుద్దీన్‌, సాబీర్‌, జైన్‌ ఉల్‌ అబేదీన్‌ పాలొని టీకా శిబిరాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement