మెదక్ కలెక్టరేట్: పౌల్ట్రీ యాజమాన్యాల సిండికెట్ పెత్తనం తగ్గించాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈమేరకు దుకాణాలు మూసి వేసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గతంలో ఆయా కంపెనీలు మార్జిన్ ఇచ్చేవని, ప్రస్తుతం సిండికేట్‌గా ఏర్పడి రిటైల్ వ్యాపారులకు ఎలాంటి మార్జిన్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికే పలుమార్లు కంపెనీలతో చర్చలు జరిపినా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. పేపర్ రేట్ ఇవ్వడంతో తాము రోజంతా కష్టపడి కంపెనీలకు లాభాలు అందించాల్సి వస్తుందన్నారు. కంపెనీల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల పాటు చికెన్ షాపులను బంద్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సాగౌడ్, ఇంత్యాజ్‌అలీ, వేణు, సన్ను, షపీ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.


