● పొట్టదశలో వరిని కాపాడుకునేందుకు పాట్లు
● ఇసుక తిన్నెలను తవ్వి కిలోమీటర్ల మేర పైపులైన్లు
కొల్చారం(నర్సాపూర్): ఎప్పటిలాగే యాసంగి సీజన్‌లో మంజీర పరివాహక గ్రామాల రైతులు పంటలు సాగు చేశారు. నీళ్లు వస్తాయన్న గంపెడాశతో నాట్లు వేశారు. తీరా సింగూరు మరమ్మతుల కారణంగా ఘనపురం ఆనకట్టకు నీటిని విడుదల చేయడం లేదంటూ అధికారులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. అయితే గతంలో లాగే సాగు నీరు విడుదల చేస్తారని భావించిన రైతులు ఉన్న నీటితో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా, నీటి గండం ఏర్పడింది. ఈక్రమంలో ఒక్క తడికి అయినా సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. జీఓ సైతం విడుదల చేయించారు. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జీఓ కాస్త బుట్టదాఖలు అయింది. దీంతో చేసేది లేక రైతులు పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు బోర్లు వేసి నీటిని పంటకు అందిస్తున్నారు. మరికొందరు ఎడారిగా మారిన మంజీర నదిలో ఇసుక తిన్నెల కింద ఉన్న నీటిని వెతికే పనిలో పడ్డారు. జేసీబీల ద్వారా గుంతలు తీసి, సిమెంటు రింగులు వేసి మోటార్లను ఏర్పాటు చేసి పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా పంట చేతికొస్తుందా..? అన్న దిగులు రైతుల్లో కనిపిస్తుంది. ఇదే పరిస్థితుల్లో నీరు విడుదల చేయకపోరా..? అన్న చిన్నపాటి ఆశ ఇంకా కొట్టుమిట్టాడుతోంది.
పొట్ట దశలో
ఉన్న వరి పంట


