సాగునీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటిని విడుదల చేయాలి

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

ఎమ్మెల్యే సునీతారెడ్డి

తుక్కాపూర్‌ మంజీరా నదిలో నిరసన

కొల్చారం(నర్సాపూర్‌)/నర్సాపూర్‌/హత్నూర (సంగారెడ్డి): నియోజకవర్గంలో ఘణపురం ఆనకట్టకు సింగూర్‌ నుంచి ఒక్క తడికి సాగు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని తుక్కాపూర్‌ గ్రామానికి మంగళవారం వచ్చిన ఎమ్మెల్యే పక్కనే ఉన్న మంజీరా నదిని సందర్శించారు. నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి నదిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...యాసంగిలో సింగూర్‌ నుంచి మంజీరా పరీవాహక ప్రాంతంలోని రైతులు పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించిందని, అయితే రైతులు సాగు చేసిన ఆ పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయని ఈ దశలో నీటి తడులు లేకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 0.3 టీఎంసీల నీటి విడుదలకు జీఓ జారీ చేసినా ప్రభుత్వ ఆదేశాలను నీటిపారుదల శాఖ అధికారులు పక్కన పెట్టడం సరికాదన్నారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించేందుకు ఓ సెట్‌ స్వచ్ఛంద సంస్థ రూ.కోటి విరాళం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉపాధి హామీ పని కల్పించకుండా, ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులోనే పని కల్పించినట్లు చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్లమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే

నర్సాపూర్‌లోని శ్రీ ఎల్లమ్మ దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ఘనంగా పూజలు చేశారు. పూజలలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, కౌన్సిలర్లు సుధీర్‌గౌడ్‌, రాజు, మోహిజోద్దీన్‌లతోపాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. పూజల అనంతరం షేక్‌ హుస్సేన్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు నాయకులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, తహసీల్దార్‌ పర్వీన్‌ షేక్‌, ఎంఈఓ వెంకట్‌ నరసింహగౌడ్‌ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement