తిరుగుబావుటా..! | - | Sakshi
Sakshi News home page

తిరుగుబావుటా..!

Feb 4 2026 8:40 AM | Updated on Feb 4 2026 8:40 AM

తిరుగుబావుటా..!

తిరుగుబావుటా..!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పిన రెబెల్స్‌..ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అయితే ఆశించిన మేర తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. హామీలు ఇచ్చి బుజ్జగింపులు చేసినప్పటికీ విత్‌డ్రా చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు రెబెల్స్‌ ఇబ్బందిగా మారింది. టికెట్‌ దక్కని వారు కొందరు ఏకంగా ఆ పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో మేమూ చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తుండటం గమనార్హం.

విత్‌డ్రా చేసుకున్నా.. సహకరించేనా?

నామినేషన్లు వేసిన వారిలో కొందరు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతల ఒత్తిడికి తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ, వీరు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపునకు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నప్పటికీ క్రాస్‌ ఓటింగ్‌ చేయించేందుకు అంతర్గతంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను కాదని మరొకరికి టికెట్‌ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చివరిరోజు నాటకీయ పరిణామాలు

పోటీలో నిలుస్తున్న రెబెల్‌ అభ్యర్థులు

టికెట్‌ దక్కకపోవడంతో

స్వతంత్రులుగా బరిలోకి..

పోటీలో నిలిచే తుది అభ్యర్థుల

జాబితాలను ప్రకటించిన అధికారులు

నామినేషన్ల విత్‌డ్రాకు చివరిరోజు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఫారమ్‌ల సమర్పణకు గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ప్రధాన పార్టీలు అంతకంటే కేవలం ఒక గంట ముందే అధికారులకు బీఫారంలు అందజేశారు. చివరి నిమిషం వరకు రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసి ఆశించిన మేర ఫలితాలను మాత్రం రాబట్టలేకపోయారు.

సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు ఐదు వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులుండగా, కాంగ్రెస్‌కు మూడు వార్డుల్లో ఉన్నారు. జోగిపేట మున్సిపాలిటీల్లో రెబెల్స్‌ సమస్య కొంత తక్కువగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి రెండు వార్డుల్లో భార్య,భర్తలు రెబెల్‌ అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. బీజేపీకి ఒక వార్డులో తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేస్తున్నారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు నాలుగు వార్డుల్లో, బీఆర్‌ఎస్‌కు మూడు వార్డుల్లో రెబెల్స్‌ పోటీ చేస్తున్నారు.

మెదక్‌ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు మూడు చోట్ల రెబెల్స్‌ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు రెండు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు రెబెల్‌ ఎక్కువగా ఉన్నారు. పది వార్డుల్లో రెబెల్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ఆరు వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నర్సాపూర్‌ బల్దియాలో ఈ తిరుగుబాటు తక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మూడు పార్టీలకు ఒక్కో వార్డు చొప్పున తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్‌ మున్సిపాలిటీలోనూ రెండు పార్టీలకు రెండు వేర్వేరు వార్డుల్లో రెబెల్స్‌ పోటీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement