పేట బల్దియాలో అవినీతి ఊట | - | Sakshi
Sakshi News home page

పేట బల్దియాలో అవినీతి ఊట

Jan 22 2026 9:53 AM | Updated on Jan 22 2026 9:53 AM

పేట బల్దియాలో అవినీతి ఊట

పేట బల్దియాలో అవినీతి ఊట

తప్పుడు బిల్లులతోరూ. కోటికి పైగా స్వాహా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంజనీరింగ్‌ అధికారిధన దాహమే కారణమా!

రామాయంపేట మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి చేరింది. పాలకవర్గం పూర్తయిన ఏడాదిలోనే రూ. కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో జరిగిన ప్రతి పనిలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ అధికారి ధన దాహమే ఇందుకు కారణమని తెలిసింది. – రామాయంపేట(మెదక్‌)

మున్సిపాలిటీకి గతేడాది 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ. 2.83 కోట్లు, జనరల్‌ ఫండ్‌ కింద రూ. 1.19 కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ. 25 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో జనరల్‌ ఫండ్‌ కింద వచ్చిన నిధులు ఏడాది వేతనాలకు ఖర్చయ్యాయి. టీయూఎఫ్‌ఐడీసీ కింద వచ్చిన నిధులతో పట్టణంలోని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కొనసాగుతోంది. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులు పెద్దఎత్తున గోల్‌మాల్‌ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌ ధర కంటే ఎక్కువ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. వందల సంఖ్యలో మొక్కలు నాటి, వేల మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేసినట్లు రూ. 35 లక్షల బిల్లులు రాసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. లైన్‌ ఫౌడర్‌ వేయడానికి సున్నం కొనుగోలు నిమిత్తం రూ. 3.98 లక్షలు ఖర్చు చూపారు. ఇందుకు రూ. వేలల్లో అయిన ఖర్చును రూ. లక్షల్లో చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాకా సంస్థ ద్వారా నాలుగు వందల బ్లీచింగ్‌ ఫౌడర్‌ సంచులు కొనుగోలు చేసినట్లు బిల్లులు రాసి రూ. 6.42 లక్షలు ఖర్చు చేశారు. దీనిపై గతంలో ఆరోపణలు రాగా, కలెక్టర్‌ తనిఖీలు నిర్వహించి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. పట్టణంలో పది వేల పండ్ల మొక్కలు పంపిణీ చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ. 4.18 లక్షలు నిధులు డ్రా చేశారు.

చెత్తబుట్టల కొనుగోలులో సైతం..

చెత్త బుట్టల కొనుగోలు విషయంలో సైతం పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తం 12,600 చెత్త బుట్టలు కొనుగోలుకు రూ. 32 లక్షల నిధులు వినియోగించినట్లు నమోదు చేశారు. వాస్తవానికి ఒక్కో చెత్త బుట్ట విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 లోపే ఉంటుంది. అధికారులు మాత్రం రూ. 253కు కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకున్నారు. ఈఏడాది శానిటేషన్‌ కింద రూ. 25.75 లక్షలు ఖర్చులు, లేబర్‌ దుస్తుల కొనుగోలు నిమిత్తం రూ. 8.65 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వాస్తవానికి ఇందులో 50 శాతం నిధులు కూడా దుస్తుల కొనుగోలు కోసం ఖర్చు చేయలేదని సమాచారం. వీధి కుక్కల స్టెరిలైజేషన్‌కు రూ. 6.27 లక్షలు ఖర్చయినట్లు చూపారు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ కింద వాల్‌ రైటింగ్‌ నిమిత్తం రూ. 3.13 లక్షలు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. శానిటేషన్‌ లేబర్‌కు షూ, దుస్తులు, గ్లౌజుల కొనుగోలు నిమిత్తం రూ.8.65 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. చెత్త ట్రాక్టర్లు, ఆటోల్లో డీజిల్‌ కోసం రూ. లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement