మెదక్‌ జిల్లాలోనూ నజర్‌.. | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లాలోనూ నజర్‌..

Jan 22 2026 9:53 AM | Updated on Jan 22 2026 9:53 AM

మెదక్‌ జిల్లాలోనూ నజర్‌..

మెదక్‌ జిల్లాలోనూ నజర్‌..

కాంగ్రెస్‌, బీజేపీల్లోని అసంతృప్తులకు గాలం మున్సిపాలిటీల్లో పట్టుకోసం ప్రయత్నాలు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వ్యూహాత్మక అడుగులు

మున్సిపల్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ చేరికలపై దృష్టి సారించింది. ఎలాగైనా మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఇందులోభాగంగా నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఈ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

యా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు, బీజేపీలకు చెందిన స్థానిక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. వీరికి ఆ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు కండువాలు కప్పేస్తున్నారు. ఇలా ఆయా పట్టణాల్లో కీలకంగా ఉన్న నాయకులను కారెక్కించుకోవడం ద్వారా పార్టీ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సంగారెడ్డి, జోగిపేట, జిన్నారం మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులకు గులాబీ కండువా కప్పుకోగా..ఒకటీరెండు రోజుల్లో మెదక్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల పరిధిలో కీలక కాంగ్రెస్‌ నాయకులు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్‌ పొన్న రాజేందర్‌రెడ్డి ఇటీవల కేటీఆర్‌, హరీశ్‌రావుల సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ నుంచి కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. జోగిపేట పట్టణానికి చెందిన తాజా మాజీ కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన కౌన్సిలర్లలో కొందరు తిరిగి తమ సొంత గూటికి చేరుతుండటం గమనార్హం. అలాగే గడ్డపోతారం మున్సిపాలిటీలోనూ స్థానికం కీలక నాయకులు ఇటీవల బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

మెదక్‌ జిల్లాలోనూ పార్టీలో చేరికలపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకులు, మహిళ నాయకులు ఒకటీ రెండు రోజుల్లో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మెదక్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రేసులో ఉన్న వీరు గురు, శుక్రవారాల్లో హరీశ్‌రావు సమక్షంలో కారెక్కే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల భొగట్టా. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో బీజేపీకి చెందిన తాజా మాజీ కౌన్సిలర్లు ఒకరిద్దరు కూడా బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

చేరికలపై బీఆర్‌ఎస్‌ నజర్‌

టికెట్లు ఖరారు కాకముందే..

మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలవాలని భావిస్తున్న నాయకులు టికెట్ల కోసం పార్టీలు మారడం సాధారణంగా జరిగేదే. కానీ, ఇంకా టికెట్లు ఖరారు కాకముందే బీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతుండటం ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటోందనే సంకేతానికి నిదర్శనమని రాజకీయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్‌ఎస్‌ ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసి మరింత పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ చేరికలపై దృష్టి సారించి ఆయా గ్రామాల్లో గట్టి పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకుంది. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారు 40% గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలను గెలుచుకోగలిగింది. ఇప్పుడు పట్టణ పోరులోనూ పట్టు నిలుపుకునేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement