బడిపాట్లు.. సర్కస్ ఫీట్లు
బస్సు సౌకర్యం లేక ఆటోలే దిక్కు
కిక్కిరిసి పయనం.. చదువు గగనం
ప్రమాదం అంచున ప్రయాణాలు
326 గ్రామాలకు బస్సులే లేవు
ప్రయాణం ప్రాణసంకటం
ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. సరైన బస్సు సౌకర్యంలేక కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బస్సు ఫుట్‌బోర్డుపై, నలుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 15 మంది చిన్నారులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
పాఠశాల విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన బస్సు సౌకర్యంలేక నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. రోజూ ఆరు నుంచి ఎనిమిది కి.మీ.లు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితులు పలు చోట్ల ఉన్నాయి. వర్షాకాలం వస్తే వీరి కష్టాలు రెట్టింపవుతుంటాయి. మరోవైపు ఆటోల్లో వెళ్లే విద్యార్థులూ ఇబ్బందులే పడుతున్నారు. ముగ్గురు ప్రయాణించే ఆటోల్లో ఏకంగా 19 మంది చిన్నారులను తీసుకెళ్తుండటం గమనార్హం. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
బస్సు సౌకర్యం లేకపోవడంతో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకంగా 369 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమేలేదు. మొత్తం 1,370 గ్రామాలు ఉండగా, దాదాపు మూడో వంతు గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులకు నడక కష్టాలు తప్పడం లేదు. ఒకవేళ ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. స్కూల్‌కు వెళ్లే సమయం.. ఇంటికి వచ్చే వేళల్లో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. 6 తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు కోవాలంటే ఈ నడక, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించే కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితులు ఒక్క మారు మూల మండలాల్లోనే కాదు, అన్ని మండలాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. చాలా రూట్లలో రద్దీ తగ్గట్టుగా బస్సు లు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డులపై ప్రమాదపు అంచుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ వద్ద బస్సు కోసం పరుగులు తీస్తున్న విద్యార్థులు
పెద్దశంకరపేట: పలు గ్రామాల నుంచి ఆటోలో వస్తున్న విద్యార్థులు
బడికి వెళ్లాలంటే రోజూ 8 కి.మీటర్లు నడవాల్సిందే..
కాలి నడకన వెళ్తున్న ఈ విద్యార్థులదీ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామం. గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు నాలుగు కి.మీ.ల దూరంలో ఉన్న కొన్యాల గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు నిత్యం కాలినడకన వెళ్తున్నారు. ఈ గ్రామాల మద్య బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇలా రోజూ ఎనిమిది కి.మీ.లు బరువైన పుస్తకాల బ్యాగ్‌తో నడవాల్సి వస్తుండటంతో కాళ్లు నొప్పులు పడుతున్నాయని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు ప్రయాణ సామర్థ్యం కలిగిన ఒక్క ఆటోలో ఏకంగా 19 మంది విద్యార్థులు కిక్కిరిసి వెళుతున్న ఈ విద్యార్థులు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. బస్సులు రద్దు కావడంతో సుమారు ఆరు కి.మీ.ల దూరంలో ఉన్న గవ్వలపల్లి, కొండాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇలా ప్రమాదపుటంచుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న హైస్కూల్ విద్యార్థులు. సుమారు మూడు కి.మీ.ల దూరంలో ఉన్న హాస్టల్‌గడ్డ వసతిగృహాల నుంచి నిత్యం 300 మంది విద్యార్థులు ఇలా ఆరు కి.మీ.ల నడిచి వెళ్లి వస్తున్నారు. ఎక్కడో మారు మూల గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందంటే సాధారణం అనుకోవచ్చు కానీ ప్రజాప్రతినిధులు ఉండే జిల్లా కేంద్రంలోని విద్యార్థుల పరిస్థితి ఇది. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని అనేక మార్లు విద్యార్థులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది..
మా ఊరి నుంచి దొంతికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దొంతిలోని మా స్కూల్‌కు వెళ్లాలంటే రోజు ఆరు కి.మీలు నడవాల్సి వస్తోంది. పుస్తకాల బ్యాగు బరువుతో ప్రతిరోజు అంతదూరం నడవాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. ఒక గంట ముందు ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోంది. వర్షకాలంలో నడుచుకుంటూ వెళ్లాలంటే మరింత ఇబ్బంది అవుతోంది. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలి.
– ఆకాంక్ష, పదో తరగతి, గంగాయిపల్లి, శివంపేట మండలం
అదనంగా 62 కొత్త బస్సులు
పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాకు అదనంగా 62 కొత్త బస్సులను తెప్పిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులు, మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం వీటిని తిప్పుతాం. పాఠశాల విద్యార్థుల రద్దీకి తగ్గట్టుగా ట్రిప్పులను పెంచాం. ప్రతి బస్టాప్‌లోనూ విద్యార్థులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలను చేర్చేందుకు డీఎంలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బస్సులు లేని గ్రామాలకు సైతం నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్‌ఎం.
నెలకు రూ.వెయ్యి ఖర్చవుతోంది..
మా ఊరిలో జెడ్పీ పాఠశాల లేకపోవడంతో రాయికోడ్‌కు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. నిత్యం ఆటోలో వెళ్లి వస్తున్నాను. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నప్పటికీ.. ఆటోచార్జీలు నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతోంది. సమయానికి బస్సు లేకపోవడంతో ఆటోలో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది.
– ప్రశాంత్, పదో తరగతి విద్యార్థి,
కూసునూరు, రాయికోడ్ మండలం.


