రద్దు చేస్తామన్న వారికి బుద్ధి చెప్పండి
మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి జిల్లాను రద్దు చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజల కు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొండన్ సావిత్రితో పాటు పలు పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మన వేలితో మన కన్ను పొడుచుకోవడమేనన్నారు. జిల్లా కేంద్రం ఉండాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందన్నారు. అలాగే కలెక్టరేట్, రైతుబజార్, ఎంసీహెచ్, మెడికల్ కళాశాల, రైల్వేస్టేషన్, ఎస్పీ కార్యాలయాలు కట్టించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం పనులు చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందన్న నమ్మకం ఉందన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ రా నివారు బాధ పడొద్దని, అందరికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభురెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం ఉండాలంటే కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు
బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు


