ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి
రామాయంపేట(మెదక్): ప్రాణం కన్నా విలువైనది ఏమి లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి, ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రెండు షీటీంలతో పాటు భరోసా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది వేల మంది మృత్యువాత పడుతుండగా, 20 వేల మంది గాయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రతి సంవత్సవం ప్రమాదాల మూలంగా 450 మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌తోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతుకుముందు ఎమ్మెల్యేతో పాటు ఎస్పీ ఇతర పోలీసులు, యువకులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.


