పుర బరి.. పీఠంపై గురి
‘పేట’లో పాగా వేసేందుకుకాంగ్రెస్ కసరత్తు ఎత్తుగడలో బీఆర్‌ఎస్, బీజేపీ ఊపందుకున్న ఆశావహుల ప్రయత్నాలు
రామాయంపేట(మెదక్): ‘పుర’ ఎన్నికలు రామాయంపేట మున్సిపాలిటీలో రసవత్తరంగా మారాయి. చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావహులు కుటుంబ సభ్యులను బరిలో ని లిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార కాంగ్రెస్‌లో నాయకుల మధ్య పోటీ తీవ్రతరమైంది. ఒక నాయకుడు తన కూతురుతో, మరో నాయకుడు భార్యతో నామినేషన్ వేయించాలని నిర్ణయించుకున్నారు. సదరు నాయకుల మధ్య ఐక్యత లోపించి ఎవరికి వారే అన్న చందంగా ముందుకెళ్తున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో అసమ్మతిని సహించమని, అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు ఇటీవల హెచ్చరించారు. ఇతర పార్టీ నాయకులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణాయం కాంగ్రెస్‌లో ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పనిలో పనిగా ఇతర పా ర్టీల నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ పంచన చేరారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై గులాబీ ఆశలు
బీఆర్‌ఎస్‌లో సైతం పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎంపీపీతో పాటు మాజీ సర్పంచ్ ఒకరు చైర్మన్ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో ప్రజలు ఈసారి తమకే పట్టం కడుతారని బీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురి మద్దతు కూడగడుతూ ముందుకెళ్తున్నారు. వరుస సమావేశాలతో తాము గట్టి పోటీ ఇస్తామనే సంకేతాలిస్తున్నారు.
సత్తా చాటాలని కమలం ఆరాటం
గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలతో ప్రజల ముందుకెళ్తున్నారు. ఇటీవల ఎంపీ రఘునందన్‌రా వు సమావేశం నిర్వహించి కార్యకర్తలకు సూ చనలు ఇచ్చారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ఇటీవల మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజల మెప్పు పొందడానికి యత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తూ వారు ముందుకు సాగుతున్నారు. కాగా మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


