ముమ్మరంగా జంతు గణన
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పోచారం అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న జంతుగణనను అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్‌ఓ జోజీతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లకోసారి జరిగే ఆల్ ఇండియా టైగర్ ప్రతిపాదనలను జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో అమలుచేస్తున్నామన్నారు. జిల్లాలో ఆరు రేంజ్‌లు, 98 బీట్‌లలో మాంసాహార జంతు గణన కొనసాగుతుందన్నారు. చిరుత పులులు ఎలుగుబంటి, నిల్‌గాయి, కొండ గొర్రె తదితర జంతువుల పాదముద్రలు, వెంట్రుకలు, గోళ్లు తదితరాలను ఏం స్క్రిప్ట్ యాప్‌లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఆర్‌ఐ లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ చరణ్, డీఆర్‌ఓ వేణు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గవ్వలపల్లి, మడూర్, శాలిపేట సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ దినకర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
‘పది’లో వందశాతం ఫలితాలు: డీఈఓ
కౌడిపల్లి(నర్సాపూర్): పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని డీఈఓ విజయ తెలిపారు. బుధవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల కో సం ప్రత్యేక ప్రణాళికా సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెప్పారు. ఆమె వెంట ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మజ, పీడీ విజయ్‌కృష్ణ, ఉపాధ్యాయులు నరేందర్, లక్ష్మణ్, శర్మ, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
‘చౌకబారు విమర్శలు మానుకోవాలి’
తూప్రాన్: బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై చౌకబారు విమర్శలు మానుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధ వారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరోజు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమా వేశంలో కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్‌రెడ్డి, నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్‌గుప్త, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నాయకులు నందాల శ్రీనివాస్, పెంటాగౌడ్, మా మిళ్ల కృష్ణ, నారాయణగుప్త, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 52.42 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 52,42,905 వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మాఘ అమావాస్యను పురస్కరించుకొని జరిగిన ఉత్సవం తర్వాత బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కానుకలు తెక్కించారు. ఇందులో కొన్ని వెండి, బంగారం మిశ్రమ కానుకలతో పాటు నగదు వచ్చినట్లు చెప్పారు. 61 రోజుల తర్వాత లెకించామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సులోచన, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముమ్మరంగా జంతు గణన


