నీటి గుంత.. తీర్చేను చింత
వట్టిపోయిన బోర్లలో నీరు పుష్కలం
● మెదక్ బల్దియాలో సమృద్ధిగా జలం ● కొత్త ఇళ్లు కట్టాలంటే గుంత నిర్మాణం తప్పనిసరి చేసిన అధికారులు
మెదక్‌జోన్: బల్దియాలో నూతన ఇళ్లు నిర్మించుకోవాలంటే నీటి గుంత తప్పనిసరని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కానీ చిన్నపాటి నీటి గుంతలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వట్టిపోయిన బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తోందని పేర్కొంటున్నారు.
13 వేలకు పైగా నివాస గృహాలు
మెదక్ మున్సిపాలిటీ ఆవిర్భవించి ఏడు దశా బ్దాలు గడిచిపోయింది. ప్రస్తుతం పట్టణ జనాభా 80 వేల పైచిలుకు ఉండగా, 13 వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో కమర్శియల్ షాపులు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఇళ్ల అవసరాల కోసం సుమారు 8,200 పైచిలుకు బోర్లు ఉన్నట్లు తెలిసింది. మిగితా ఇళ్లకు మున్సిపల్ అధికారులు నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రతి రోజు బోరు మోటార్ల ద్వారా వేలాది పంపు సెట్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాగా నూతన ఇళ్లు నిర్మించుకునే వారిలో 70 శాతం ప్రజలు బోరు తవ్విన తర్వాతే నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో నీటి సమస్య ఉత్పన్నం కాకున్నా, వేసవిలో మాత్రం భూగర్భజలాలు తగ్గిపోయి సమస్యలు ఎదురవుతున్నాయి. 2012 వేసవిలో మెదక్‌లో చాలా వరకు బోర్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రజలు వ్యవసాయ బోరు బావుల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకున్నారు. ఈక్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరూ బోరు తవ్వగానే దాని పక్కనే వర్షపు (ఫిట్) గుంత నిర్మించాలనే నిబంధన పెట్టారు. ప్రస్తుతం గతంలో తవ్వించిన బోర్లు ఫెయిల్ కాగా, ఈ ఏడాది వేసవిలో వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మించారు. దీంతో వాటిలో ప్రస్తుతం పుష్కలంగా నీరు వస్తోంది. వీటి నిర్మాణం బట్టి ఖర్చు అవుతుంది. మామూలు ఇంటి కోసం తవ్వించిన బోరుకు 4/6 గుంతకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, కమర్శియల్ (రెంట్) బిల్డింగ్ కోసం 10/10 వర్షపు గుంతకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.


