ఐత చంద్రయ్య రచనలు అమోఘం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ కవి ఐత చంద్రయ్య రచనలు అమోఘమని, జాతీయ సాహిత్య పరిషత్ (జాసాప) అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ఐతా చంద్రయ్య రచించిన ‘మంచుముద్ద’ కథకు చోటు దక్కింది. జాసాప కార్యవర్గం ఆదివారం సిద్దిపేట శాఖ గ్రంథాలయంలో ఐత చంద్రయ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశంలు మాట్లాడుతూ కథా సాహిత్యంలో ఐతా చంద్రయ్య రచనలు అద్భుతమన్నారు. జాతీయ స్థాయి అవార్డులు సైతం ఐతా చంద్రయ్యకు లభించాలని ఆకాంక్షించారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ తన రచన మంచుముద్ద కథ 1995లో రాసినట్లు తెలిపారు. మంచుముద్ద కథ డిగ్రీ కళాశాల తెలుగు పాఠంగా ఎంపిక చేయడంపై కళాశాల ప్రిన్సిపాల్, తెలుగు శాఖ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కవులు పెందోట వెంకటేశ్వర్లు, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


