కాలం కలిసిరాలె..
పొలాలనన్నీ హలాల దున్నీ.. ఇలా తలంలో హేమం పిండే రైతన్నలకు గడ్డు రోజులు దాపురించాయి. అప్పుల కుంపటి నెత్తిమీద ఉన్నప్పటికీ, ఈసారైనా రాత మారదా అన్న ఆశతో ఏటా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే వరుణుడు శీతకన్ను వేశాడు. జిల్లాలో అతివృష్టితో పెద్ద మొత్తంలో పంటలు నీటి పాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు లోనయ్యారు. ప్రకృతి ప్రకోపానికి, పాలకుల చిన్నచూపునకు గురై మెతుకుసీమ రైతు విలవిలలాడుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
అన్నదాతకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తర్వాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈక్రమంలో రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతిశాయి. జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం మిగిల్చాయి. జిల్లా పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు వందలాది ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. ముఖ్యంగా వరిపంట 6,000 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. పత్తి 475, మొక్కజొన్న 50, పెసర 70, కూరగాయలు ఇతర పంటలు కలిపి 150 ఎకరాల్లో దెబతిన్నట్లు నిర్ధారించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు నష్టపరిహారం విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ సైతం ముగుస్తుండటంతో ఇంకెప్పుడు ఇస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.
50 ఎకరాలు మాత్రమే గుర్తింపు
భారీ వర్షాలతో జిల్లా పరిధిలో చెరువులు, కుంటలు, రహదారుల పక్కనే ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు వరద నీటితో పొంగి పొర్లాయి. వీటి కింద ఉన్న వ్యవసాయ భూముల్లో 1,500 ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. ఈమేరకు వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. ఉపాధి హామీ పథకంలో ఇసుక మేటలు తొలగిస్తామని ప్రకటించినా, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకు సాగడం లేదు. తమ సొంత ఖర్చుతో ఇసుకమేటలు తొలగించుకోవాలంటే రూ. లక్షలు ఖర్చు పెట్టుకునే స్థోమత లేదని రైతులు వాపోతున్నారు. కాగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు మాత్రం జిల్లా పరిధిలో కేవలం 50 ఎకరాల్లో మాత్రమే ఈసారి ఇసుక మేటలు తొలగిస్తామంటున్నారు. రైతుల వి నతుల మేరకే తాము ఈనిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
చి‘వరి’కి ముంచిన మోంథా
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు, సుమారు 500 పైచిలుకు కేంద్రాలను ప్రారంభించారు. చాలా సెంటర్లకు ధాన్యం రావడంతో 15 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభించారు. కాగా మోంథా తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మొక్క జొన్న మొలకెత్తి రంగు మారింది. పత్తి నీరు గారింది. మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మొ త్తానికి వానాకాలం సీజన్ రైతులకు కష్టాలు, నష్టాలనే మిగిల్చింది.
నష్టపరిహారం అందించాలి
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించినా, ఇప్పటివరకు తమకు అందలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలతోనూ తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– లాలు, చౌకత్‌పల్లి
ప్రభుత్వానికి నివేదించాం
గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన ప ంట నష్టం తాలూకు వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
– రాజ్‌నారాయణ, ఏడీఏ
రైతన్న ఆగమాయె..
అనుకూలించని ‘ఖరీఫ్’ సీజన్
అతివృష్టితో దెబ్బతిన్న పంటలు
పరిహాసంగా మారిన ప్రభుత్వ సాయం
మెతుకుసీమ రైతు కన్నీటి వ్యథ


