వామ్మో వానరం
జనాల్లో కలవరం ● ఇళ్లలోకి చొరబడి బీభత్సం బాటసారులపై తరచూ దాడులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు సంతోష్. మెదక్ పట్టణంలోని కుమ్మరిగడ్డ. ఇటీవల బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా కోతులు మీద పడి దాడి చేయడంతో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతడి చేయి విరిగింది. ఫలితంగా మూడు నెలల పాటు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా పట్టణంలో చాలా మంది కోతుల బాధితులు ఉన్నారు. నివారణ చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
మెదక్ మున్సిపాలిటీ: వానరాలతో జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉంచితే చాలు లోపలికి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నా యి. దొరికిన వాటిని పట్టుకెళ్తున్నాయి. ఇక రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఒకప్పుడు అట వీ ప్రాంతానికే పరిమితమైన కోతులు, ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటికి ఆహారం, నీరు లభించకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి.
కొండముచ్చు ఫ్లెక్సీతో ప్రయోగం
జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కోతులు సంచరిస్తున్నాయి. వాటిని నివారించేందుకు బల్దియా అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కోతులు ఎక్కువగా సంచరించే మున్సిపల్ కార్యాలయం, అజంపురా, బ్రహ్మణవీధి తదితర ప్రాంతాల్లో సుమారు 50 వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కోతులు ఫ్లెక్సీలకు భయపడటం లేదు. కోతులను పట్టించడంతోనే సమస్యకు పరిష్కారమని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
ప్రాణం పోతుందనుకున్నా..
ఆరబెట్టిన బట్టలు తీసుకొచ్చేందుకు డాబాపైకి వెళ్లాను. ఒక్కసారిగా కోతుల గుంపు మీద పడి దాడిచేశాయి. నా కేకలు విని కింద నుంచి మా కుటుంబీకులు కర్రలతో వచ్చి వాటిని వెళ్లగొట్టారు. అప్పటికే కాళ్లు, చేతులు, తలపై తీవ్రంగా గాయపర్చాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కోతులను తరిమిలేయాలి.
– హైమద్ హుస్సేన్, మెదక్
బల్దియా భరించే పరిస్థితి లేదు
జిల్లా కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. కోతులు పట్టే వారిని పిలిపించాం. వారు ఒక్కో కోతిని పట్టేందుకు రూ. 600 అడుగుతున్నారు. అంత భారం భరించే పరిస్థితిలో మున్సిపాలిటీ లేదు. కొండముచ్చును చూస్తే కోతులు భయపడతాయి. అందుకే వార్డుల్లో ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశాం.
– శ్రీనివాసరెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్
మెదక్ పట్టణంలో
గుంపులుగా సంచరిస్తున్న కోతులు
							వామ్మో వానరం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
