
మంజీరా ఉగ్రరూపం
● ఘనపురంపై నుంచి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు ● నీట మునిగిన వెయ్యి ఎకరాలు ● మెదక్‌కు నిలిచిన రాకపోకలు
పాపన్నపేట(మెదక్)/కొల్చారం(నర్సాపూర్): మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తుంది. ఘనపురం ప్రాజెక్టు దిగువన గల మొదటి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి నీట మునిగాయి. రెండు రోడ్లను మూసివేయడంతో పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మంజీరా వరదలు పోటెత్తడంతో తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు వెయ్యి ఎకరాలకుపైగా వరి పంట నీట మునిగింది. మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరాల్సిన పంట గంగ పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఎంకెపల్లి, చిత్రియాల్, గాజులగూడెం, కొడుపాక, నాగ్సాన్‌పల్లి, ఎల్లాపూర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుప్‌పేట, ఆరెపల్లి, మిన్‌పూర్, ముద్దాపూర్, రామతీర్థం, మల్లంపేట, కందిపల్లి, చీకోడ్, కొంపల్లి తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. కొల్చారం మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లో నదికి ఇరువైపులా పంటలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు, వరద ఉధృతి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది.