
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని అయితే మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, మున్సిపల్‌ల్లో కోడ్ ఉండదని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారానికి 3 రోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినట్లు, డబ్బులు పంచినట్లు సమాచారముంటే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరూ రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లకూడదని, పెళ్లిల్లు, ఆస్పత్రి ఖర్చులు, పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించేందుకు అంతకుమించి డబ్బు తీసుకెళ్లి పట్టుబడితే సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పేపర్, టీవీ, సోషల్ మీడియా యాడ్స్ విషయంలో పార్టీలు, అభ్యర్థులు ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య పాల్గొన్నారు.
ర్యాలీలు, సభలకు
అనుమతులు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్