
మాకు రిజర్వేషన్ ఉండదా?
మెదక్ కలెక్టరేట్/పాపన్నపేట(మెదక్): డభై ఐదేళ్లుగా ఒక్కసారి కూడా తమ గ్రామం ఎస్సీలకు రిజర్వుడు కాలేదని పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి దళితులు ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా కుట్రపూరితంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్‌లో సదరు గ్రామంలోని దళితులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కేటాయించిన రిజర్వేషన్లతో తాము పోటీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 25% ఎస్సీ జనాభా ఉండగా గతంలో రెండు వార్డులు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండేవని తెలిపారు. ఈసారి ఆ రెండు కూడా లేకుండా కుట్రతో రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపించారు. దళితులు కనీసం వార్డు మెంబర్‌గా కూడా ఎదగొద్దని కుట్రపూరితంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు ఉందన్నారు. గ్రామంలో 8వార్డులు ఉండగా 4 వార్డుల్లో 90% ఎస్సీలు, 10% ఓసీ జనాభా ఉందని తెలిపారు. ఆ వార్డుల్లో బీసీ రిజర్వేషన్ చేయడంతో ఎస్సీలు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో 4 వార్డుల్లో ఓసీలు, బీసీలు లేరు, అక్కడ అన్‌రిజర్వ్ చేశారని ఆరోపించారు. ఈ రిజర్వేషన్‌ను పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలసిన వారిలో గ్రామానికి చెందిన దళితులు దినకర్, ఆనంద్, కుమార్, అనంతి, దేవయ్య, సాయిబాబు, ఆగమయ్య, సామేల్, సాయికుమార్,భాగ్య, రత్నమ్మ తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్ వద్ద కొత్త లింగాయపల్లి
దళితుల నిరసన
ఎస్సీలున్న చోట బీసీలకు..
బీసీలున్న చోట ఎస్సీలకు రిజర్వేషన్!