
రాజుకున్న ఎన్నికల వేడి
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా రోజున మద్యం, మటన్ పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. రిజర్వేషన్ కలిసిరాని బడానేతలు పక్కమండలం నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు.
– మెదక్‌జోన్:
జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయితీలు, 21 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో ఎన్నికలు జరుగనున్నాయి. ఆశావహులకు రిజర్వేషన్ కలిసొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు పోటీ చేయదలచుకున్న నేతలు గ్రామాల్లో అప్పుడే మందు, విందులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే మద్యం కొనుగోలు!
ఎన్నడూలేనివిధంగా చిన్నా, చితక పనులుంటే మాకు చెప్పండి చేసి పెడతాం అంటూ వరుసలు పెట్టి మరీ పలుకరిస్తూ ఓటర్ దేవుళ్లను ఆశావహులు మచ్చిక చేసుకుంటున్నారు. గాంధీ జయంతి రోజున మద్యంషాపులు మూసిఉంటాయని ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు తెల్లవారు జామునే ఇంటికి కిలో చొప్పున మటన్, ఆఫ్ బాటిల్ చొప్పున మద్యం పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
పక్క మండలాలకు వలస
మెదక్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక 2019లో మొదటిసారి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. ప్రస్తుతం ఆ సీటు జనరల్‌కు కేటాయించింది. జిల్లాలో పలువురు బడా నేతలు జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్ అనుకూలించలేదు. దీంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సదరు నేతలు పక్కమండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచేందుకు పావులు కదుపుతున్నారు.
ఆశలు అడియాశలైన వేళ
ఇందులో ప్రధానంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి (ఓసీ) వర్గానికి చెందిన వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను వీడి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పట్లో ఆయనకు జెడ్పీచైర్మన్ పదవి కట్టబెడతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ అయితే ఆయన స్వగ్రామం కౌడిపల్లి సొంత జిల్లా పరిషత్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో కొల్చారం ఓసీ జెడ్పీటీసీ జనరల్ కావటంతో అక్కడి నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే నియోజకవర్గం మాసాయిపేటకు చెందిన రాజిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయన సైతం జెడ్పీ చైర్మన్ ఆశించినప్పటికీ ఆయన జిల్లా ప్రాదేశిక(జెడ్పీటీసీ)ఎస్సీలకు రిజర్వుడ్ అయింది. పాపన్నపేట మండలానికి చెందిన తాజా, మాజీ ఎంపీపీ చందన భర్త ప్రశాంత్‌రెడ్డి అదేమండలానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మండలంలోని జిల్లాపరిషత్ బీసీకి రిజర్వుడ్ కావటంతో వారి ఆశలు సైతం అడియాశలైయ్యాయి. మొదటి నుంచి ఎన్నోఆశలు పెట్టుకుని రూ.లక్షలు ఖర్చులు పెట్టుకున్న బడానేతలు పక్కమండలాల నుంచి పోటీచేసి జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకునేందుకు రాష్ట్రనేతల వద్దకు పరుగులు పెడుతున్నారు.
రిజర్వేషన్ కలిసొచ్చిన గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
దసరారోజు మటన్,
మద్యం పంపిణీకి సన్నాహాలు
రాష్ట్ర నేతల ఆశీస్సులకోసం పరుగులు