
కోడ్ కూసింది
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో కోడ్
అమల్లోకి వచ్చింది. ముందుగా ప్రాదేశిక,
ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 37 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం అయింది.
– మెదక్‌జోన్
జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్ డివిజన్ పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న విత్‌డ్రాకు అవకాశం కల్పించి, 23న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ల పరిధిలో గల 11 మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. చేగుంట, నార్సింగి, మాసాయిపేట, వెల్దుర్తి, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి 16న స్క్రూ ట్నీ, 17న అప్పిల్ (ఫిర్యాదు), 18న వివరణ, 19న విత్‌డ్రాకు అవకాశం కల్పించి 27న ఎన్నికలు జరుపనున్నారు. మొదటి, రెండో దశలో జరిగిన పోలింగ్‌కు సంబంధించి నవంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
పంచాయతీ ఎన్నికలు ఇలా..
జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. 31న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు 2:30 గంటల నుంచి సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేట్టి ఫలితాల వెల్లడించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, చిలప్‌చెడ్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, తూప్రాన్, మనోహరాబాద్, మాసాయిపేట, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి మండలాల పరిధిలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 27న విత్‌డ్రాకు అవకాశం కల్పించి, అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 4వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఫలితాల వెల్లడించనున్నారు.
అధికారులు సర్వం సిద్ధం
ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,052 పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశారు. ప్రిసైడింగ్, రూట్ అధికారులతో పాటు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,220 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3,882 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా, గుజరాత్ నుంచి 1,036 బాక్సులను తెప్పించారు. జిల్లాలో 2,846 సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం 736 మంది అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు.
జిల్లాలో రెండు విడతల్లో
ప్రాదేశిక, పంచాయతీ పోరు
వచ్చేనెల 23, 27 తే దీల్లో
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
నవంబర్ 11న ఓట్ల లెక్కింపు
పోలింగ్ రోజునే
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు
జిల్లాలో ఇలా..
గ్రామ పంచాయతీలు 492
వార్డు సభ్యులు 4,220
జెడ్పీటీసీల సంఖ్య 21
ఎంపీటీసీలు 190
ఎంపీపీలు 21
మొత్తం ఓటర్లు 5,23,327
మహిళలు 2,71,787
పురుషులు 2,51,532
ఇతరులు 8

కోడ్ కూసింది