
‘జెడ్పీ’ పీఠానికే గురి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పట్టు కోసం కాంగ్రెస్..పునర్వైభవం కోసం బీఆర్‌ఎస్..ఉనికి కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్నాయి.
– మెదక్ అర్బన్:
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ ఈ సారి పట్టు సాధించేందుకు కృషి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రధానాస్త్రంగా ప్రయోగించే యత్నాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని భావిస్తోంది. ఆ దిశగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు పార్టీ కేడర్‌ను బలోపేతం చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్నవారికి, పార్టీ కోసం కష్టించిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అలాగే సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక సొంత గ్రామాల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో కాంగ్రెస్ నుంచి జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్న ఓ పెద్దాయన, పక్క మండలం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది.
కమలం వికసించేనా!
గత పార్లమెంటరీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీని స్థానిక ఎన్నికల్లో సైతం వికసించేలా ప్రచార పర్వం కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాని మోదీ పేరుతో యువతను, సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.యువకులు, విద్యాధికులపై పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న గ్రామాలపై దృష్టి పెట్టింది. గెలుపు అవకాశాలున్న అన్ని చోట్ల, గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ‘సేవా పక్షం’పేరిట ఎంపీ రఘునందన్‌రావు స్థానిక సంస్థల ఎన్నికల శంఖాన్ని పూరించారు. ఆయన ఎంపీగా ఎన్నికై న అనంతరం పలు రోడ్లు, సోలార్ దీపాలను మంజూరు చేయించారు. నియోజక వర్గంలో తరచూ పర్యటనలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
పట్టు చేజారినివ్వకుండా బీఆర్‌ఎస్
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఊడ్చేసిన బీఆర్‌ఎస్ తిరిగి పునర్వైభవం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18 స్థానాల్లో విజయం సాధించడంతోపాటు సుమారు 15 ఎంపీపీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అదే పట్టును కొనసాగించేందుకు ‘ఇంటింటికీ బాకీ కార్డు’ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఆపార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను ఎండగట్టే విధంగా ప్రచార సరళి నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. గ్రామీణులను ఆకట్టుకునేలా డాక్యుమెంటరీలు రూపొందించినట్లు తెలుస్తోంది. రైతులకు యూరియ కష్టాలు, మహిళలకు రూ.2,500 ఫించన్, రూ.4 వేల నిరుద్యోగ భృతిని వంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణుల్ని ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి కాపాడుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అదే బలంతో ఎన్నికల పోరాటంలో నిలిచి విజయం సాధిస్తామన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. ఇక బీఆర్‌ఎస్ నుంచి ఓ ప్రధాన నాయకుడికి సొంత ప్రాదేశిక నియోజక వర్గంలో జెడ్పీటీసీ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పట్టు కోసం కాంగ్రెస్.. పునర్వైభవం కోసం బీఆర్‌ఎస్.. ఉనికి కోసం బీజేపీ
జెడ్పీ చైర్మన్ కోసం
వలస వెళ్లనున్న పెద్దాయన
స్థానిక సంస్థల్లో పట్టుకోసం
సర్వశక్తుల్ని కూడదీసుకుంటున్న పార్టీలు