
ప్రణాళికలు సిద్ధం చేయండి
● జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● అధికారులతో అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష
మెదక్ కలెక్టరేట్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ప్రణాళికను పటిష్టంగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసీజన్‌లో జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ డం లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మిల్లర్లు సమయానికి ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతికి అవసరమైన 10 శాతం బ్యాంకు గ్యారంటీని, అగ్రిమెంట్‌ను వెంటనే సమర్పించాలన్నారు. 2024– 25 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అందించాలన్నారు. పంట పక్వానికి రాకముందే కోతలు కోయవద్దని రైతులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం, డీఎం జగదీశ్, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.