దసరా తర్వాతే కానుక | - | Sakshi
Sakshi News home page

దసరా తర్వాతే కానుక

Sep 21 2025 9:08 AM | Updated on Sep 21 2025 9:08 AM

దసరా తర్వాతే కానుక

దసరా తర్వాతే కానుక

● ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బతుకమ్మ చీరలా..? డ్రెస్‌కోడా..? ● స్పష్టత ఇవ్వని అధికారులు ● గతేడాది సైతం మహిళలకు అందని వైనం

● ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బతుకమ్మ చీరలా..? డ్రెస్‌కోడా..? ● స్పష్టత ఇవ్వని అధికారులు ● గతేడాది సైతం మహిళలకు అందని వైనం

మహిళలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం షాకిచ్చింది. ఉచిత చీరలు పంపిణీ చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అక్టోబర్‌ తర్వాత చీరలు వస్తాయని, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు మాత్రమే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా ఒకే కలర్‌ (డ్రెస్‌ కోడ్‌)లో ఉంటాయని తెలిసింది. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 15,232 స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది వరకు సభ్యులు కలిపి మొత్తం 1,58,239 మంది ఉన్నారు. కాగా వీరందరికీ బతుకమ్మ పండుగకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. వీరి వివరాలను డీఆర్‌డీఓ శాఖ ఉన్నతాధికారులకు పంపించింది. గ్రూపు సభ్యులకు ఒక్కో చీర చొప్పున పంపిణీ చేస్తారని, అవి ఈనెల 15 వరకు జిల్లాకు చేరు కుంటాయని అధికారులు ముందుగా ప్రకటించారు. తాజాగా అక్టోబర్‌ మొదటి వారంలో చీరలు రానున్నాయని, అవి కూడా ఒకే కలర్‌లో ఉంటాయని చెబుతున్నారు.

పెదవి విరుస్తున్న మహిళలు

మహిళలందరికీ బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాగా గతేడాది సైతం మహిళలకు చీరలు పంపిణీ చేయలేదు. ఈ పండుగకు అయినా అందజేస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎంతో సంతోషంగా ఎదురుచూశారు. కానీ ఈసారి సైతం ఇవ్వకపోగా, దసరా అనంతరం ఇస్తామని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. అవి కూడా డ్రెస్‌కోడ్‌ అని తెలియడంతో పెదవి విరుస్తున్నారు. కాగా గత ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఒక్కో చీర చొప్పున పంపిణీ చేసింది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 2,71,787 మంది ఉండగా, వారిలో మహిళా సంఘం గ్రూపులో ఉన్నవారు 1,58,239 మంది, గ్రూప్‌ సభ్యులు కాని వారు 1,13,548 మంది ఉన్నారు. ఈ లెక్కన కేవలం 60 శాతం మంది మహిళలు మాత్రమే సంఘ సభ్యులుగా ఉన్నారు.

పండుగ తర్వాత పంపిణీ చేస్తాం

జిల్లాకు ఈనెల 15 వరకు చీరలు వస్తా యని మొదట్లో ఉన్నతాధికారులు చెప్పారు. మళ్లీ అక్టోబర్‌ 2 తర్వాత వస్తాయని చెబుతున్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు మాత్రమే ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అవి కూడా ఒకే రకం కలర్‌లో ఉంటాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

– సరస్వతి, అదనపు డీఆర్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement