
తుట్టెలు కట్టి.. పురుగు పట్టి
● జిల్లాలో దొడ్డు బియ్యం నిల్వల పరిస్థితి ● ప్రభుత్వానికి రూ. 11 కోట్ల మేర నష్టం! ● పట్టించుకోని అధికార యంత్రాంగం
రామాయంపేట(మెదక్): జిల్లాలో మిగిలిపోయిన 3,044 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పురుగుల మయమైంది. నిల్వలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాడైపోయాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 11 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు జిల్లాకు సరఫరా చేసిన దొడ్డు బియ్యం స్టాక్ అలాగే ఉండిపోయింది. వీటిని తరలించే విషయమై సివిల్ సప్లై శాఖ తాత్సారం చేస్తుండటంతో నిల్వ ఉన్న బియ్యం తుట్టెలు కట్టి.. పురుగులు పట్టింది.
చర్యలు తీసుకోకపోతే మరింత నష్టం
జిల్లాలో 520 రేషన్ దుకాణాలున్నాయి. వీటి ద్వారా పేదలకు గత ఏప్రిల్ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంతకుముందు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ కావడంతో జిల్లాలో రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లో ఓ మూలన పెట్టారు. దాదాపు ఆరు నెలలు గడుసున్నా, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని భద్రపర్చడం డీలర్లకు సమస్యగా మారింది. పురుగులు పట్టడంతో నెలవారీ కోటా సన్న బియ్యానికి సైతం పారుతున్నాయని, ఎలుకల సమస్య పెరిగిందని ఆ ందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంల్లో నిల్వ ఉన్న 3,044 మెట్రిక్ టన్నుల బియ్యం విలువ సుమారు రూ. 11 కోట్ల పైమాటే. పౌర సరఫరాల శాఖ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో ఇలా..
దొడ్డు బియ్యం నిల్వలు మెట్రిక్ టన్నుల్లో..
గోదాంల్లో 259.254
రేషన్ దుకాణాల్లో 503.116
బఫర్ గోదాంల్లో 2,281.675
ఉన్నతాధికారులకు నివే దించాం
జిల్లావ్యాప్తంగా నిల్వ ఉంచిన దొడ్డు బియ్యం స్టాక్‌కు పురుగులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఈవిషయమై ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అతి త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
– జగదీశ్, డీఎం, సివిల్ సప్లై

తుట్టెలు కట్టి.. పురుగు పట్టి