
ధాన్యం సేకరణకు సన్నద్ధం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కాగా గతేడాది కంటే ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో దొడ్డురకం 2.28 లక్షలు, సన్న రకం 77 వేల ఎకరాల్లో సాగైంది. కాగా దొడ్డు రకం ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రాగా, సన్నరకం మాత్రం ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈలెక్కన మొత్తం 7.1 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 3.41 లక్షల మెట్రిక్ టన్నులు బయట వ్యాపారులకు విక్రయించగా, కొనుగోలు కేంద్రాలకు 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, వాటిలో 90 సెంటర్లలో ప్రత్యేకంగా సన్న ధాన్యం సేకరించనున్నారు. కాగా గతేడాది మాదిరిగా సన్న ధాన్యం బస్తాలను గుర్తించేందుకు పచ్చధారంతో కుట్టు వేయనున్నారు. కాగా ఈ ఏడాది నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 8 మిషన్లు అందుబాటులో ఉన్నాయని, మరో 200 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేసి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్ష మెట్రిక్ టన్నులు అదనం!
కాగా గతేడాది ఖరీఫ్ సీజన్‌లో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 480 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ ఏడాది 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన గత సీజన్‌తో పోలిస్తే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా రానుంది. కాగా ఈ ధాన్యాన్ని మరాడించేందుకు 91 రైస్ మిల్లులకు ధాన్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముందుగానే బ్యాంకు గ్యారంటీలతో పాటు మిల్లింగ్ అగ్రిమెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.
అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు
జిల్లావ్యాప్తంగా 480 సెంటర్ల ఏర్పాటు
సన్న ధాన్యం సేకరణకు 90 ప్రత్యేక కేంద్రాలు
3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
50 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం
3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 90 లక్షల గన్నీ బ్యాగులు అవసరం. కానీ ప్రస్తుతం 50 లక్షల బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్న ట్లు తెలుస్తోంది. మరో 40 లక్షలను అవసరం మేరకు విడతల వారీగా తెప్పించనున్నట్లు సమాచారం.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ధాన్యాన్ని కొను గోలు చేసేందుకు అక్టోబర్ 1 నుంచి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. రైతులు తక్కు వ ధరకు దళారులకు విక్రయించి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి.
– జగదీష్‌కుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారి

ధాన్యం సేకరణకు సన్నద్ధం