
నిధులు లేకున్నా.. పనులు
● కార్యదర్శుల సమస్యలను
అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్)/నర్సాపూర్: పంచాయతీల్లో నిధులు లేకున్నా కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మాసాయిపేట రైతు వేదికలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ, తాగునీటి సరఫరా వంటి పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కొనసాగిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పంచాయతీ వర్కర్లకు నెలనెలా జీతాలు రాకపోవడంతో తమ సొంత డబ్బులు వారికి చెల్లించి పనులు చేయించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీలకు నిధులు సమకూరేవని అన్నారు. కార్యదర్శులు లేవనెత్తిన సమస్యలను అసెంబ్లీ ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. అకాలవర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కల్వర్టులు, రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమా ండ్ చేశారు. సమావేశంలో డీఎల్‌పీఓ యాదయ్య, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కౌడిపల్లి మండలం దేవులపల్లికి పలువురు నాయకులు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆహ్వానించారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు. అలాగే పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.