
అభ్యాస దీపిక.. విజ్ఞాన దిక్సూచిక
● పది విద్యార్థుల కోసం రూపకల్పన
● అక్టోబర్ 10 నుంచి ప్రత్యేక తరగతులు
మెదక్ అర్బన్: పదో తరగతిలో శతశాతం ఫలితా ల కోసం విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అక్టోబర్ 10 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించబోతున్నారు. మెరుగైన ఫలితాల సాధనలో భాగంగా ఈసారి కూడా అభ్యాసన దీపికలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించి మొత్తం 38,040 అభ్యాస దీపికలు మెదక్ పాఠ్య పుస్తక డిపోకు చేరుకున్నాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
ఈ ఏడాది మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఎస్‌ఈఆర్‌టీ ఆధ్వర్యంలో విషయ నిపుణులతో తయారు చేసిన అభ్యాస దీపికలు పంపిణీ చేస్తున్నారు. జీవశాస్త్రం, భౌతిక, గణితం, సాంఘీక శాస్త్రాలకు సంబంధించి దీపికలు ముద్రించారు. జిల్లాకు మొత్తం 38,040 అభ్యాస దీపికలు చేరుకున్నాయి. పుస్తకంలో లఘు, వ్యాసరూప, బహుళైచ్చిక ప్రశ్నలకు జవాబులతో తయారు చేశారు. వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, అందులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి జవాబులు ఎలా రాయాల్లో వివరించారు. పాఠాల వారీగా ఎలాంటి ప్రశ్నలు, బిట్లు వస్తాయనే విషయాలను పొందుపరిచారు. చదు వులో వెనుకబడిన విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని టీచర్లు చెబుతున్నారు. జిల్లాలో 146 మండల పరిషత్, 15 కేజీబీవీ, 2 మైనార్టీ వెల్ఫేర్, 6 ఎంజేపీ, 7 మోడల్, 11 టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఒక ఆశ్రమ పాఠశాల ఉండగా, 9,883 విద్యార్థులు ఉన్నారు. అలాగే 3, 4, 5 తరగతులకు సంబంధించి పార్ట్ బీ గణితం, ఈవీఎస్ టైటిల్స్ రావాల్సి ఉందని సమాచారం.