
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ నెల రోజుల వ్యవధిలో జిల్లాలో అన్నిశాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. 140 మంది పిల్లలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులు, సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగిన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 140 మంది బాలలను రక్షించి 90 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.