
బాల్య వివాహాలు జరిపిస్తే చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాధవి హెచ్చరించారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో గురువారం ఓ మైనర్ బాలిక నిశ్చితార్థ వేడుకలను పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు చిట్టోజిపల్లికి చెందిన ఓ యువకుడితో కుటుంబసభ్యులు ఇటీవల పెళ్లి సంబంధం నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాధవి, వెల్దుర్తి పోలీసులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలతో సంఘటనా స్థలానికి చేరుకొని నిశ్చితార్థ వేడుకలను అడ్డుకున్నారు. మైనర్ బాలికలకు వివాహం జరిపించడం వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి జరిపిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని బాలిక తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీని తీసుకున్నారు.