అన్నదాతల మేలుకే ‘భూ భారతి’
అల్లాదుర్గం(మెదక్): రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చేవెళ్ల గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టంలో మార్పులు చేసేందుకు తహసీల్దార్లకే అధికారం ఉంటుందన్నారు. ఇక కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకుంటే గ్రామంలో విచారణ జరిపి పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి రైతుకు భూమిపై హక్కులు కల్పి స్తూ భూదాన్ కార్డులు అందజేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో ఐడీ నంబర్ కొడితే పూర్తి వివరాలు, హద్దులు తెలుస్తాయని వివరించారు. పట్టా ఒకరిపై, కబ్జాలో ఒకరు.. పట్టా భూమి అసైన్డ్‌గా రికార్డులో ఉండటం, అసైన్డ్ భూమి పట్టాగా మారిన సంఘటనలు ఉన్నాయన్నారు. వీటిని గతంలో మార్పు చేసే అధికారం లేకుండా ఉండేదన్నారు. ప్రస్తుత చట్టంతో దరఖాస్తులు స్వీకరించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు. పట్టా భూమి అసైన్డ్ భూమిగా మారిందని ఓ రైతు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఇలాంటి సమస్యలు 14 వేలకు పైగా ఉంటే 10 వేల సమస్యలు పరిష్కరించామని చెప్పారు. మరో 4 వేలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కొత్త చట్టంలో పరిష్కరిస్తామన్నారు. తహసీల్దార్ వద్ద తప్పు జరిగితే ఆర్డీఓకు.. అక్కడ తప్పు జరిగితే కలెక్టర్‌కు అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. అక్కడ తప్పని భావిస్తే సీసీఎల్‌లో అప్పిల్ చేసుకొనే అవకాశం కొత్త చట్టంలో కల్పించినట్లు వివరించారు. సాదాబైనామా, పౌతి అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ మల్లయ్య, ఏఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామా, పౌతి అమలుకు ఇబ్బంది ఉండదు
30 రోజుల్లో సమస్యలు పరిష్కారం
కలెక్టర్ రాహుల్‌రాజ్


