మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా 2025 జనవరిలో ఏర్పాటైంది. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు, హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, ముల్కల్ల, పోచంపాడ్, గుడిపేట్, నంనూరు, చందనాపూర్, నర్సింగాపూర్ గ్రామాలను కలిపి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. విలీన మున్సిపాలిటీతో పాటు, గ్రామాలను కలుపుకుని కార్పొరేషన్ పరిధి విస్తీర్ణం 144.01 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి 38.32 చదరపు కిలోమీటర్లు ఉండగా, నస్పూర్ మున్సిపాలిటీ 53.37 చదరపు కిలోమీటర్లు, హాజీపూర్ మండలంలోని 8 విలీన గ్రామాలు 52.32 చదరపు కిలోమీటర్లు. పరిధి పెరిగిందే కానీ, అందుకు తగిన మౌలిక సదుపాయాలను మాత్రం కల్పించలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడిన సమయంలో ఈ ప్రాంత జనాభా 1,73,219 వరకు ఉండగా, 2026లో 2.80 లక్షలకు పైగా జనాభా ఉండనుందని అధికారులు అంచనా వేసి, 60 డివిజన్లతో కార్పొరేషన్‌ను విభజించారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా..
మంచిర్యాల మున్సిపాలిటీగా 1956లో ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్–1 మున్సిపాలి టీగా మారి, ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును అందుకుంది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో మంచిర్యాల జిల్లాగా ఏర్పడింది. అంతకుముందు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు జిల్లా కేంద్రంగా అనధికారికంగా కొనసాగింది. రైలుమార్గంతో పా టు, సింగరేణి గనులు విస్తరించి ఉండడంతో పారి శ్రామిక ప్రాంతంగా మంచిర్యాలకు గుర్తింపు ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మంచిర్యాల కూడా ఉంది. హైదరాబాద్‌లోని భూముల విలువతో సమానంగా ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఏ కార్పొరేట్ సంస్థలైనా హైదరాబాద్ తరువాత మంచిర్యాలలో నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రైలు మార్గం, నేషనల్ హైవేలు ఉండడంతో ఈ ప్రాంతంలో నివసించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ము న్సిపాలిటీ నుంచి జిల్లా కేంద్రం, ఆతర్వాత కార్పొరేషన్‌గా మారినా, గతంలో మున్సిపాలిటీకి ఉన్న అధి కారులు, సిబ్బందినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
పెరిగిన పరిధి... తగ్గిన సిబ్బంది
మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నిర్వహించాల్సిన వి దుల కంటే కార్పొరేషన్‌గా మారిన తరువాత బాధ్యతలు, సేవల పరిధి మరింత విస్తరించింది. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, పన్నుల వ సూళ్లు, పట్టణ అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కా రం, తదితర విభాగాల్లో పనిభారం పెరిగింది. ఇందుకు అనుగుణంగా అధికారులు, సాంకేతిక సిబ్బంది, ఇతర ఉద్యోగుల నియామకాలు చేపట్టకపోవడంతో అందుబాటులో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. దీంతో పలు విభాగాల్లో పనుల పర్యవేక్షణ, ప్రజల ఫిర్యాదులు, పట్టణ సమస్యలపై స్పందనకు జాప్యం ఏర్పడుతోంది. కీలక విభాగాల్లోనూ ఖాళీలు ఉండడం వల్ల అభివృద్ధి పనులను సకాలంలో చేపట్టలేకపోతున్నారు.
మంచిర్యాల నగరం
కీలక పోస్టులు ఖాళీ...
మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పాటయ్యాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీగానే వస్తున్నాయి. కానీ ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను సకాలంలో ప్రారంభించి, వాటిని పర్యవేక్షించే కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో, ప నుల్లో జాప్యం జరుగుతోంది. ఇంజినీరింగ్ విభా గంలో డిప్యూటీ ఈఈ పోస్టు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 2, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 2, శానిటరీ జవాన్ పోస్టులు 2, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు 2, టౌన్ ప్లానింగ్ ట్రేసర్ పోస్టులు 2, టౌన్ సర్వేయర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నాయి. వార్డు ఆఫీసర్లు 60 మందికి 36 మంది మాత్రమే పనిచేస్తుండగా, 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్పొరేషన్ హోదాకు సరి పడా ఉద్యోగులను కేటాయిస్తే డిప్యూటీ కమిషనర్ పోస్టు 1, ఇంజినీరింగ్ విభాగంలో ఈఈ పోస్టు 1, ఏఈ పోస్టులు 3, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు 1, శానిటరీ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టులు అదనంగా పెరుగుతాయి.


