మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మొదటి సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. జిల్లాలు ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఐబీ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహానికి, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుతో ప్రజలు జిల్లా అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి మార్గం దొరికిందన్నారు. దివాకర్‌రావు మాట్లాడుతూ వేడుకలను జరుపుకునేందు కు ఐబీ చౌరస్తాలో వేసిన టెంట్లను అర్థరాత్రి తొలగించడం దారుణమన్నా రు. మంచిర్యాలకు బదులు బెల్లంపల్లిని జిల్లాగా చేయాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే డిమాండ్ నెరవేరలేదన్న అక్కసుతో దశాబ్ది ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు, వృత్తి సంఘాల నాయకులను శాలువాలతో సత్కరించారు.


