ఈయూ కూటమి ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

ఈయూ కూటమి ఘన విజయం

Oct 10 2026 12:28 AM | Updated on Oct 10 2026 12:28 AM

● ఆర్టీసీ ‘గుర్తింపు’ ఎన్నికలు ప్రశాంతం ● తెల్లవారుజాము నుంచే ఓటర్ల బారులు ● పోటాపోటీగా యూనియన్ల శిబిరాలు

మంచిర్యాలఅర్బన్‌: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) కూటమి ఘన విజయం సాధించింది. మంచిర్యాల డిపోలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు కార్మికులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటలకు జరిగిన పోలింగ్‌లో 403 మంది ఓటర్లకు గాను 388 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆరుగురు ఓటు వేసేందుకు రాకపోగా, ఒకరు ఉద్యోగ విరమణ పొందినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ దుర్గం క్రాంతి ప్రకటించారు. ఉదయం 9గంటల వరకు 213మంది ఓటు వేశారు. ఆ తర్వాత మందకొడిగా సాగిన ఓటింగ్‌ సాయంత్రం మళ్లీ పుంజుకుంది. ప్రతీ కార్మికుడు రాష్ట్ర స్థాయికి, మరొకటి రీజియన్‌ స్థాయి గుర్తింపు ఓటు వేశారు. డిపో గేటుకు ఇరువైపులా వివిధ యూనియన్లు టెంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. బ్యాలెట్‌ పేపర్‌పై తొమ్మిది గుర్తులు ముద్రించినా టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కూటమి, ఈ యూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే అధికారులు బ్యాలెట్‌ బాక్స్‌లను సీల్‌ వేసి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. ఈ నెల 14, 15న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరుగనుండగా లెక్కింపు పూర్తి చేసి 17న ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

హోరాహోరీగా...

హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ కూటమి ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ఆదిలాబాద్‌ రీజినల్‌ స్థాయిలో టీఎంయూ నిచ్చెన గుర్తుపై పోటీ చేయగా.. రాష్ట్ర స్థాయిలో బస్సు గుర్తుపై పోటీచేసిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ టీఎంయూపై విజయబావుటా ఎగురవేసింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ క్రాంతి పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి ఓట్లను లెక్కించారు. 403ఓట్లలో డిపో పరిధిలో రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం తలపడిన ఈయూ(బస్సు గుర్తు)కు 244, టీడబ్ల్యూయూ(బాణం)గుర్తుకు 142 ఓట్లు, రెండు యూనియన్లకు ఒక్కో ఓటు వచ్చాయి. రీజియన్‌ స్థాయిలో పోటీపడిన టీఎంయూ(నిచ్చెన)–208 ఓట్లు, టీడబ్ల్యూయూకు(బాణం) –178 ఓట్లకు పరిమితం కాగా.. కత్తెర రెండు ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎస్‌డబ్ల్యూయూ, టీడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) కూటమిగా బరిలో దిగాయి. టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్‌ యూనియన్‌లు జేఏసీగా పోటీలో దిగి విజయకేతనం ఎగురవేసింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రాత్రి వరకు కౌంటింగ్‌..

రాత్రి 9గంటల వరకు కౌంటింగ్‌ కొనసాగింది. వెలువడిన ఫలితాల్లో ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల్లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కూటమి సత్తా చాటింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భైంసా, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ వంటి కీలక డిపోల్లో టీఎంయూ విజయం సాధించినట్లు తెలిసింది. దీంతో రీజియన్‌ పరిధిలో కార్మిక సంఘాల మధ్య నెలకొన్న పోటీలో టీఎంయూ–ఎన్‌ఎంయూ–ఈయూ కూటమి తన ప్రభావాన్ని చాటుకుంది.

కార్మికుల సంబురాలు..

గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం సాధించడంతో మంచిర్యాల బస్‌ డిపో వద్ద కార్మికులు, నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈయూ–టీఎంయూ(జేఏసీ) నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement