మంచిర్యాలఅర్బన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకై న బతుకమ్మ పండుగ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు జరిగే పండుగ నేపథ్యంలో మార్కెట్ పూలతో కళకళలాడుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లలో మహిళలు, కుటుంబ సభ్యులు బతుకమ్మ పేర్చడానికి అవసరమైన తీరొక్క పూలు కొనుగోలు చేశారు. పల్లెల నుంచి పట్టణాలకు చేరిన తంగేడు, గునుగు, సీతజడ, కట్ల పూలు, బంతి, చామంతి తదితర విక్రయాలు జోరుగా సాగాయి. దేవీ శరన్నవరాత్రులూ ప్రారంభం కానుండడంతో పూలకు గిరాకీ పెరిగింది. కొందరు చిరు వ్యాపారులు చుట్టుపక్కల రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేయగా.. పెద్ద వ్యాపారులు బెంగళూర్, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బంతి, చామంతి, గులాబీ, లిల్లీ పూలను దిగుమతి చేసుకున్నారు. కిలోకు బంతి పూలు రూ.100 నుంచి రూ.120, చామంతి రూ.400, గులాబీ రూ.350 వరకు ధరలు పలుకుతున్నాయి. తంగేడు, గునుగు కట్టలను రూ.50 నుంచి రూ.100వరకు విక్రయించారు.
ఎంగిలి పూల బతుకమ్మ
మొదటి రోజు పూలను ముందు రోజు తెంపి, నీటిలో నానేసి ఉంచుతారు కాబట్టి దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతుంటారు. శనివారం ఆశ్వయుజ మా సంలో మహాలయ అమావాస్య రోజున మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. సాయంత్రం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతారు. ఆడపడుచులు బతుకమ్మను పేర్చి పాటలతో గౌరమ్మను కొలిచిన తర్వాత నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి కలిపిన ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు వేడుకలు కొనసాగుతాయి.


