మంచిర్యాలఅగ్రికల్చర్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే ఉచిత చేపపిల్లల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. త్వరలో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. జూలై, సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లోకి నీరు చేరింది. జిల్లాలో సెప్టెంబర్‌లోనే నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోగా.. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేక విడుదలలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరు రిజర్వాయర్లు, 19 పెద్ద చెరువులు, 374 చిన్నచెరువులు, కుంటల్లో నాలుగు రకాల చేపపిల్లలు వేయనున్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో రెండేళ్లుగా నీరు నిల్వ లేక చేపపిల్లలు వేయడం లేదు. ఈ నెలాఖరులోగా విడతల వారీగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి చేపపిల్లలు వదలనున్నారు. జిల్లాలోని వేమనపల్లి, జైపూర్ మండలం కుందారం, ఖమ్మం నుంచి రూ.2.60కోట్ల విలువైన చేపపిల్లలను తీసుకొచ్చి వదిలేందుకు సిద్ధం చేశారు.
లక్ష్యంగా భారీగా..
జిల్లాలోని 142 మత్స్య సహకార సంఘాల్లో 8,188మంది పురుష, మహిళా సభ్యులు ఉన్నారు. 399చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 2.25 కోట్ల చేపపిల్లలు విడుదల చేయనున్నారు. చెరువుల్లో బొచ్చ, రహు, కామనకట్లా, రిజర్వాయర్లలో ఈ మూడింటితోపాటు మిృగాల వంటి నాలుగు రకా లు వేయనున్నారు. చెరువుల్లో 35నుంచి 45మిల్లీమీటర్లు, రిజర్వాయర్లలో 80నుంచి వంద మిల్లీమీటర్ల పరిమాణం గల చేపపిల్లలు వదులుతారు. 11,500 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.20కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యం భారీగా ఉండగా.. చేపపిల్లల విడుదల ఆలస్యమైతే ఎండల తీవ్రత, సాగునీటి విడుదల, మురికినీరు లేక ఆశించిన మేర ఉత్పత్తి ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు.


