సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మిల్లర్లు గత ఖరీఫ్(వానాకాలం) సీజన్ కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) గడువు లోపు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం బియ్యం ఎఫ్‌సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు అప్పగిస్తున్నారు. గతంతో పోలిస్తే వేగంగా సీఎంఆర్ డెలివరీ జరుగుతోంది. ఎఫ్‌సీఐలో బియ్యంకు స్థల కేటాయింపులు, వ్యాగన్లతో రవాణా జరుగుతోంది. అయినప్పటికీ గడువు ప్రకారం ఈ నెల 31లోపు పూర్తి చేయాలి. మరో 20రోజుల్లో 19శాతం వరకు డెలివరీ చేయాల్సి ఉంది. దీంతో నిర్ణీత గడువులోపు పూర్తవడం కష్టంగానే మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా సీఎంఆర్ డెలివరీ చేస్తున్న జిల్లాలో ఉన్నప్పటికీ నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా లేదు. ఇక రబీ(యాసంగి) సీజన్‌లో మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం సైతం డెలివరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 53శాతం పూర్తయింది. దీంతో మిగిలిన బియ్యం అప్పగించాల్సి ఉంది. దీంతో మరోసారి గడువు పెంచే అవకాశాలున్నాయి.
మిల్లర్లలో వణుకు
గతంలో కంటే సీఎంఆర్‌పై సర్కారు కఠినంగా వ్యవహరిస్తుండడంతో బియ్యం అప్పగింతలో నిర్లక్ష్యం వీడుతున్నారు. తనిఖీలు, నిత్యం మిల్లర్లతో సమీక్షచేస్తుండడంతోనూ సీఎంఆర్ డెలివరీలో వేగం పెరుగుతోంది. గతంలో బాకీలు ఉన్న మిల్లర్లపై ఆర్‌ఆర్, క్రిమినల్ కేసులతోపాటు పీడీ యాక్టులు నమోదవుతున్నాయి. దీంతో మిల్లులు బ్లాక్ లిస్టులో లేకుండా కొనసాగించాలంటే ఎప్పటికప్పుడు బియ్యం అప్పగించేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో సీఎంఆర్ అప్పగింతలో గతంలో కంటే వేగం పెరిగింది.


