మంచిర్యాలటౌన్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మంచిర్యాల నగరంలో ప్రజల రద్దీ విపరీతంగా పెరిగింది. షాపింగ్ చేయడానికి వస్తున్న వారితో దుకాణాల్లో సందడి నెలకొంది. మరోవైపు మార్కెట్ రోడ్డులో రూ.78కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు పనుల్లో జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జూలైలోనే అండర్‌గ్రౌండ్ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా పలు కారణాలతో ఆలస్యమైంది. అక్టోబర్ నెల వచ్చినా ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో పండుగల సీజన్ కావడంతో మార్కెట్‌లో వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పండుగలకు నూతన వస్త్రాల కొనుగోళ్లు, గృహోపకరణ పరికరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. సింగరేణి ప్రాంతం కావ డం, కార్మికులకు లాభాల్లో వాటాలు, బోనస్‌లు ఇవ్వడంతో అన్ని వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతాయి. నగరంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. గతంలో పోలీసు, మున్సిపల్ శాఖ అధికారులు సంయుక్తంగా పలు స్థలాలను పరిశీలించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చేపట్టిన 60 ఫీట్లకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే విశాలంగా మారుతుంది. విస్తరణ పనులు పూర్తయ్యే వరకు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే ప్రజలకు కొంత వరకై నా ఇబ్బందులు తొలిగేందుకు అవకాశం ఉంటుంది.
దుమ్ము లేస్తోంది..
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో కాల్‌టెక్స్ నుంచి ఏఎంసీ, కాంటా చౌరస్తా, బజారు ఏరియా మీదుగా కన్నాల బస్తీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు అంతర్గత ప్రధాన రహదారి పూర్తిగా దుమ్ము, ధూళికి నిలయంగా మారింది. బస్సులు, వ్యాన్‌లు, లారీలు రాకపోకలతో దుమ్ము లేస్తోంది. రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడం సంకటంగా మారింది. దుమ్ము లేవకుండా నిబంధనల ప్రకారం వాటర్ ట్యాంకర్‌తో రోడ్డుపై రోజుకు మూడుపూటలు నీళ్లు చల్లించాల్సి ఉ న్నా అదేమీ పాటించడం లేదు. చౌడేశ్వరి, పాత మున్సిపల్ కార్యాలయం నుంచి పాత ఫైర్‌స్టేషన్ వరకు దుమ్ము, ధూళి ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు దగ్గు, జలుబు, ఆస్తమా, శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారడం, కళ్ల మంట, చర్మ సమస్యలు తదితర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి దుమ్ము ప్రభావానికి రోడ్డు కనిపించకుండా పోవడంతో గుంతల కారణంగా మోటారుసైకిళ్లు కిందపడిన ఘటనలు ఉన్నాయి. దుమ్ము, ధూళీ రోడ్డుకు ఇరువైపుల తినుబండారాల షాపులు, హోటళ్లు, టీ, టిఫిన్ పాయింట్లు, కిరాణ దుకాణాల్లో చేరుతోంది.
ట్యాంకర్‌తో నీళ్లు చల్లిస్తాం
మున్సిపాలిటీలో ఒకే వాటర్ ట్యాంకర్ ఉంది. వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్నాం. రెండో వాటర్ ట్యాంకర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అప్పటి వరకు రోడ్డుపై దుమ్ము, ధూళి రేగకుండా రోజువారీగా నీళ్లు చల్లిస్తాం. ప్రస్తుతం కరెంటు స్తంభాల పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లోనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తాం.
– తన్నీరు రమేష్, మున్సిపల్ కమిషనర్, బెల్లంపల్లి


