పెద్ద చేపలు చిక్కట్లే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అవినీతిలో కొందరు అధికారులు బెదురు లేకుండా లంచాలకు ఎగబడుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా అక్రమ సంపాదనకు ఆరాట పడుతున్నారు. చాలా కేసుల్లో అధికంగా కింది స్థాయి సిబ్బంది ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కి పట్టుబడుతుండగా ఉన్నతాధికారులు మాత్రం చిక్కడం లేదు. చాలాచోట్ల కిందిస్థాయి సిబ్బందితోనే ఉన్నతాధికారులు వసూళ్లకు పాల్పడుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగులే డబ్బులు తీసుకుంటూ చిక్కుతున్నారు. ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో ఏళ్ల పాటు విచారణ సాగుతోంది. కొన్ని సార్లు ఉద్యోగ విరమణ పొందే వరకు కూడా విచారణ పూర్తి కావడం లేదు.
రూ.కోట్లలో అక్రమాలు
ఉమ్మడి జిల్లాలో ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే పలు ప్రభుత్వ శాఖల్లో నిత్యం రూ.లక్షల్లో అక్రమాలు సాగుతున్నాయి. పెద్ద అధికారుల చేతికి మట్టి అంటకుండా చిన్న అధికారులను ముందుంచి కథ నడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు డబ్బులు తీసుకుంటూ చిక్కుతున్నారు. బాధితులు, ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులను చిక్కేలా వల వేసి పట్టుకోవాల్సి ఉంది. అంతేకాక ఆయా శాఖల్లో విభాగాధిపతులపై నిఘా పెడితే పట్టుబడే అవకాశం లేకపోలేదు.
ప్రజల్లో పెరిగిన చైతన్యం
గతంలో కంటే ప్రస్తుతం ఏసీబీ పట్ల అవగాహన పెరగడంతో బాధితులు నేరుగా అధికారులను సంప్రదిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతమై నేరుగా తమను లంచం అడుగుతున్నవారిపై హెల్ప్‌లైన్, వాట్సాప్, ఫోన్ నంబర్లతో ఏసీబీని సంప్రదిస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. టోల్ ఫ్రీ నంబరు 1064కు, వాట్సాప్ నంబరు 9440446106 ద్వారా నేరుగా సంప్రదించాలని కోరుతున్నారు.
అవినీతి జరుగుతున్న శాఖలు
రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, పోలీసు, ఆర్టీఏ, కమర్షియల్ ట్యాక్స్, సివిల్‌సప్లయి, మున్సిపల్, పంచాయతీ, ఇంజనీరింగ్, విద్యుత్, కార్మిక, అటవీ తదితర శాఖల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారింది. చాలా మంది అధికారులు లంచాలు తీసుకుంటూ బయటపడడం లేదు. బాధితులు సైతం ఎక్కడా వెల్లడి చేయకపోవడంతో లంచగొండి అధికారులకు కలిసి వస్తోంది.


