విత్‌డ్రాపై మంతనాలు
ముగిసిన నామినేషన్ల పరిశీలన
1,177 నామినేషన్లు ఆమోదం
జిల్లాలో ఐదు పత్రాలు తిరస్కరణ
3న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఒక్కో వార్డు, డివిజన్ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులతో మంతనాలు మొదలయ్యాయి. ఒకే రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు వేసిన చోట్ల ఈ పరిస్థితి అధికంగా ఉంది. జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర, గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రుల వరకు ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. దీంతో ఒక్కో చోట ఐదు కంటే ఎక్కువగానే అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. అభ్యర్థుల వారీగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మిగతా వారిని పోటి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. మూడు రోజుల్లో జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో ఉన్న 149 వార్డుల్లో 1061 మంది 1599 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆమ్ ఆద్మీ, ఎంఐఎంతోపాటు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ 519, బీఆర్‌ఎస్ 411, బీజేపీ 326, స్వతంత్రులు 117 మంది ఉండగా.. మిగతా వారు వివిధ పార్టీల కు చెందిన వారు ఉన్నారు. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి చోట్ల నామినేషన్లు వేశారు. నిబంధనల ప్రకారం లేని వాటిని అధికారులు పరిశీలన అనంతరం తిరస్కరించారు. బెల్లంపల్లిలో ఒకటి, మంచిర్యాల, చెన్నూర్‌లో రెండు చొప్పున మొత్తంగా ఐదు తిరస్కరణకు గురయ్యాయి. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అన్ని నామినేషన్లు ఆమోదించారు. ఈ నెల 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు తుదిగా పోలింగ్ బ్యాలెట్ పేపర్‌లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.
అన్ని చోట్ల రెబల్స్
టికెట్లు దక్కయని తెలిసిపోయిన చోట్ల వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్‌లో గుర్తులు, వరుస క్రమంతో రానున్నాయి. దీంతో కొద్ది పాటి ఓట్లతోనే గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్‌ఎస్, బీజేపీలో సొంత పార్టీ నాయకులు బరిలో ఉన్నారు. తమకు టికెట్ కేటాయించకున్నా పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పడం లేదు. కొందరు చివరి క్షణంలో తమకు బీ ఫాం దక్కే అవకాశం ఉందనే నమ్మకంతో ఉంటున్నారు. ఇంకా అధికారికంగా బీ ఫాంలు అందకపోయే సరికి అందరూ ఆతృతతో ఉన్నారు. బెల్లంపల్లిలో అధికార పార్టీ నాయకుల మధ్య టికెట్ల విషయంలో పోటాపోటీ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోనూ రెబల్స్ పోటీలో ఉన్నారు.
పరిశీల అనంతరం నామినేషన్ల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు నామినేషన్లు
మంచిర్యాల 60 362 386
బెల్లంపల్లి 34 252 279
చెన్నూరు 18 154 171
క్యాతనపల్లి 22 193 241
లక్సెట్టిపేట 15 100 100
మొత్తం 149 1061 1177
తిరస్కరణ గురైనవి 05


