నిర్మలమ్మ కరుణించేనా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పలు పథకాల్లో భాగంగానే జిల్లాకు నిధులు వస్తున్నాయి. కానీ ఏటా కేంద్రం నుంచి ప్రత్యేకంగా జిల్లాకు నిధులేమీ దక్కడం లేదు. ఈసారైనా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రాంత వాసులపై కరుణ చూపాలని కోరుతున్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను కోల్ ఇండియాలో మాదిరి యాజమాన్యామే చెల్లించేలా వెసులుబాటు, కొత్త గనులు సింగరేణికి కేటాయింపులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గోదావరి పరిరక్షణ, అభివృద్ధి కోసం కేంద్రం దయ చూపాల్సి ఉంది.
మంచిర్యాలకు స్మార్ట్‌సిటీ హోదా..
జిల్లాలో ప్రస్తుతం అమృత్ భారత్ స్కీం కింద జిల్లా కేంద్రంతో మంచిర్యాలతో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, లక్సెట్టిపేటలో పనులు కొనసాగుతున్నాయి. నీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం జరుగుతోంది. ఇక కార్పొరేషన్‌గా మారిన మంచిర్యాల నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే నిధులు మౌలిక వసతుల పెంపునకు దండిగా వచ్చే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల సరసన జిల్లా కేంద్రం చేరే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. మంచిర్యాల నగరం రాముని చెరువు ముందు నుంచి టు టౌన్‌కు రాకపోకలు మెరుగు పర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం టు టౌన్ వెళ్లాలంటే అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐబీ నుంచి వెళ్లే ఓవర్ బ్రిడ్జి పై నుంచి రోజువారీగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే హమాలీవాడ వెళ్లేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసింది తెలిసిందే.
రైల్వేస్టేషన్ల ఆధునీకరణ
రైల్వేస్టేషన్ల ఆధునీకరణ కోసం నిధులు రావాల్సి ఉంది. మంచిర్యాల స్టేషన్ అమృత్‌భారత్‌లో ఎంపికై ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్ టీ వరకు స్టేషన్ల ఆధునీకరణ జరగాల్సి ఉంది. వీటిలో రేచినీ రోడ్‌లో కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో లేదు. ఇక మధ్య తరహా స్టేషన్లలో రైళ్లు నిలపకవపోడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.


